పకడ్బందీగా రికార్డుల కంప్యూటరీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : వక్ప్ బోర్డ్ రికార్డుల కంప్యూటరీకరణ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సర్కార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదుల ముతవల్లీ ప్రెసిడెంట్‌లు, అన్ని పార్టీల ముస్లిం నాయకులకు వక్ఫ్‌భూముల ఆస్తుల వివరాలు ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను వివరించాలన్నారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. తప్పిదాలు చోటు చేసుకుంటే సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరించారు. అనంతరం వక్ఫ్ రికార్డులు, ఆస్తులు, ఆదాయం నిర్వహణలో పాదర్శకతను పెంచి, మిగిలిన ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి ఎలా ఉపయోగించాలో వివరించారు. వక్ఫ్ ఆస్తుల సమాచారాన్ని అప్‌లోడ్ చేసే సమయంలో డీఆర్‌వో, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సహాయం తీసుకొవాలన్నారు. ఈ ఓరియెంటేషన్ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ హరినాథ్‌రెడ్డి, జిల్లా వక్ప్‌బోర్డ్ ఇన్‌స్పెక్టర్ రియాజ్ పాల్గొన్నారు.


