నైపుణ్యాలను పెంపొందించండి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం జనవిజ్ఞాన వేదిక ఉచితంగా ఎన్‌ఎంఎంఎస్ పుస్తకాలను రూపొందించింది. ఆ పుస్తకాలను శనివారం కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు అరుణ్‌శివప్రసాద్ మాట్లాడుతూ ఈ పుస్తకాలను జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు జయంతి, పర్యావరణ విభాగం కన్వీనర్ సుధాకర్, జేవీవీ నాయకులు విజయ్, చిరంజీవి, గణిత ఫోరం జిల్లా అధ్యక్షులు చంద్రమనాయుడు పాల్గొన్నారు.


