
పలుకుబడి ఉంటేనే‘సార్’!
ఆ ఉపాధ్యాయులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులా? విచారించిన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాష్ట్ర అవార్డులపై సర్వత్రా విమర్శలు
గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం గురుపూజోత్సవం రోజున అందజేసే అవార్డులకు సైతం రాజకీయ రంగు పులిమింది. పలుకబడి ఉన్న ఉపాధ్యాయులనే రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కాల్ చేసి మరీ ‘మీరు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులా..’ అంటూ విచారించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చిత్తూరు కలెక్టరేట్ : గురువు స్థానానికి వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తమ బోధన చేస్తున్న టీచర్లను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తుండడం రివాజుగా మారుతోంది. అయితే ఇటువంటి గొప్ప సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులమడం విమర్శలకు తావిస్తోంది.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులున్నారా?
జిల్లా వ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రతిపాదనల రూపంలో సిద్ధం చేసి అందజేశారు. దరఖాస్తులు చేసుకున్న టీచర్లందర్నీ జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ ఇంటర్వ్యూలు చేపట్టింది. ఇందులో ప్రతిభ చాటిన టీచర్లు పలువురు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టేశారు. రాజకీయ పలుకుబడి, రాజకీయ సిఫార్సులున్న వారిని రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక చేసి.. మిగిలిన టీచర్లను అవమానపరిచారు.
ఇష్టానుసారంగా ఉత్తర్వులు
రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ల అవార్డులకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారంగా జారీచేశారు. మొదట్లో 1:1 ప్రాతిపదకన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆ తర్వాత 1:2 ప్రాతిపదికన ప్రతిపాదనలు పంపాలన్నారు. అదే విధంగా లీప్ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోని టీచర్లను సైతం ఇంటర్వ్యూలకు పిలిపించుకున్నారు. అవార్డులు పొందొచ్చనే ఆశతో ఉత్తమ ప్రతిపాదనలతో జిల్లా నుంచి పలువురు టీచర్లు రాష్ట్ర స్థాయి ఇంటర్వ్యూలకు వెళ్లారు. అయితే అటువంటి వారందరినీ పక్కన పెట్టి సిఫార్సులున్న వారికి అవార్డులకు ఎంపిక చేశారని దరఖాస్తు చేసుకున్న టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి విధానం అమలు చేయలేదని వాపోతున్నారు.
ఉపాధ్యాయ అవార్డులకు రాజకీయ రంగు