
విన్నవించినా..ఫలితం లేదు సార్!
● కలెక్టరేట్‌కు క్యూ కట్టిన అర్జీదారులు ● వివిధ సమస్యలపై 320 అర్జీలు
చిత్తూరు కలెక్టరేట్ : తమ సమస్యల పై ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా న్యాయం మాత్రం దక్కడం లేదని అర్జీదారులు వాపోయారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 320 అర్జీలను అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌వో మోహన్ కుమార్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ తదితరులు అర్జీలు స్వీకరించారు.
రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు
రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని పెనుమూరు మండలం, కత్తిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ, మాణిక్యరాయినిపల్లె దళితవాడకు చెందిన మహాలక్ష్మి మహిళా సంఘం సభ్యులు లక్ష్మమ్మ, చిన్నక్క వాపోయారు. తమ సంఘంలో ఇది వరకు పది మంది సభ్యులు ఉండే వారని, అందులో ఇద్దరు సభ్యులు తీసుకున్న రుణం సరిగా చెల్లించకపోవడం, సంఘం జరుపుకునేందుకు హాజరు కాకపోవడంతో ఆ ఇద్దర్నీ సంఘం నుంచి తొలగించినట్టు తెలిపారు. తొలగించినందుకు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి తమను భయపెడుతున్నారన్నారని వాపోయారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేయడం వల్ల తమ గ్రూపు సభ్యులు ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షలు చెల్లించి గ్రూపును రద్దు చేసుకోవాలని తమ సంఘం ఈవో అధికారి బెదిరిస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నారు
హైకోర్టు తీర్పును ఉల్లంగిస్తున్నారని కాణిపాకం పంచాయతీ మాజీ సర్పంచ్ గోపీనాథ్, గ్రామస్తులు వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 5 వేల మంది జనాభా ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన శ్మశాన స్థలంపై గతంలో ఎండోమెంట్ ఈవో జోక్యం చేసుకుని హైకోర్టులో కేసు వేశారన్నారు. ఆ కేసులో తీర్పు పంచాయతీకి అనుకూలంగా వచ్చిందన్నారు. అయితే హైకోర్టు తీర్పును ఉల్లంఘించి శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు 1 బీ లో నమోదు చేసి డ్రోన్ సర్వే చేస్తున్నారన్నారు.
న్యాయం చేయండి
క్వారీ పనుల వల్ల తమ గ్రామంలోని గృహాలు చీలిపోతున్నాయని బైరెడ్డిపల్లి మండలం టి.గడ్డూరు గ్రామస్తులు జీవీ భాస్కర్‌రెడ్డి, రవిరెడ్డి, మునిరత్నమ్మ, పుష్పకుమారి వాపోయారు. తమ గ్రామానికి అర్ధ కిలోమీటరు దూరంలో క్వారీ పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఆ క్వారీ పేలుళ్ల వల్ల గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని వాపోయారు.
జీవనోపాధి కల్పించండి
జీవనోపాధి కల్పించండి సారూ అంటూ సదుం మండలం, ఎరుకులపురం గ్రామానికి చెందిన శంకర, అంజీ కోరారు. తమది బాతులు మేపుకునే వృత్తి అని, ఆ వృత్తిలో విపరీతమైన నష్టాన్ని ఎదుర్కొన్నామన్నారు. వడ్డీ వ్యాపారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఇప్పటికీ సొంత నివాసం లేక ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. తమకు స్థిరమైన జీవనోపాధి కల్పించి న్యాయం చేయాలని కోరారు.

విన్నవించినా..ఫలితం లేదు సార్!

విన్నవించినా..ఫలితం లేదు సార్!

విన్నవించినా..ఫలితం లేదు సార్!