బైక్ అదుపు తప్పి యువకుడు దుర్మరణం
చౌడేపల్లె: ఎవరబ్బా ఈ యువకుడు..!? ఎంత స్పీడుగా పోతున్నాడో చూడు అని అందరూ అలా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఆ యువకుడిని ఆ స్పీడే బలిగొంది. సోమవారం ఈ సంఘటన సోమల మండలం ఇరికిపెంట సమీపంలోని చెన్నపట్నం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. చౌడేపల్లె మండలం లద్దిగంకు చెందిన సందీప్(25) కోళ్లఫారాల వద్ద కోళ్లను టెంపోలకు, లోడింగ్ చేసే పనులకు కూలీగా వెళ్లేవాడు. బైక్‌లో సోమల వద్దకు కూలీ పనుల నిమిత్తం వెళ్లి స్వగ్రామానికి తిరుగుప్రయాణంలో మృత్యువాత పడ్డాడు.
వేగంగా వెళ్తూ చెన్నపట్నం చెరువు వద్ద మలుపులో అదుపుతప్పి పడ్డారు. తలకు తీవ్రగాయమైంది. 108లో అతడిని చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడి తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కలచివేశాయి. సోమల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించారు.