
న్యాయం కోసం అంధుడి పోరాటం
● కలెక్టరేట్ ఎదుట ఆందోళన
చిత్తూరు కలెక్టరేట్ : మెరిట్ ప్రకారం ఎంపికై నా ఇంటర్వ్యూలో తనకు అన్యాయం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అంధుడైన రమేష్ ప్లకార్డు చేతబట్టి సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ ఎంపికలో మెరిట్‌లో ఎంపికై న విభిన్న ప్రతిభావంతుడైన తనను వైద్య ఆరోగ్య శాఖ నిరాకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తాను మెరిట్ ప్రకారం ఎంపికయ్యానని, అయితే ఇంటర్వ్యూ దశలో డీసీహెచ్‌ఎస్ అధికారులు తనకు కళ్లు కనబడటం లేదనే కారణంతో ఎంపిక ప్రక్రియను రద్దు చేశారన్నారు. దివ్యాంగుల కోటాలో సంబంధిత డిజబులిటీ సర్టిఫికెట్, మెరిట్ ఆధారంగా తనకు ఉద్యోగం రావాల్సి ఉన్నప్పటికీ నిష్కారణంగా తొలగించారని పేర్కొన్నారు. తన సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు న్యాయం చేయలేదని, ఇకనైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వరసిద్ధుని సేవలో జైళ్ల శాఖ డీజీపీ
కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని సోమవారం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అంబానీకుమార్ తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనాంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికారు. శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ ధరణీధర, సిబ్బంది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

న్యాయం కోసం అంధుడి పోరాటం