
పొట్టేళ్ల చర్మాన్నీ తినేశారు!
● వ్యాపారస్తుడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్ ● రూ.15 లక్షలు తీసుకున్న తెలుగు తమ్ముళ్లు ● అక్రమాలకు నిలయంగా బోయకొండ
సాక్షి టాస్క్‌ఫోర్సు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బోయకొండలో తెలుగు తమ్ముళ్లకు కాసుల పంట పండుతోంది. అక్రమార్జనతోపాటు దౌర్జన్యకాండ సాగుతోంది. గంగమ్మ సొమ్ము అప్పనంగా మింగేయడం.. అధికారులు సైతం తమ్ముళ్లకు తలొగ్గి ఆలయ ఆదాయానికి గండికొట్టడం రివాజుగా మారుతోంది. టెండర్లు, వేలం పాటల్లో ఏకపక్షంగా వ్యవహరించి ఆలయ ఆదాయాన్ని కొల్లగొట్టిన తమ్ముళ్లు.. ఇప్పుడు భక్తులు జంతు బలులిచ్చిన పొటేళ్లు, మేకపోతులు, దున్నపోతుల చర్మాలను సైతం మింగేయడం విమర్శలకు తావిస్తోంది.
జరిగేది ఇలా..
సాధారణంగా ఒక్క ఆదివారం మాత్రమే సుమారు 300 నుంచి 400 పొట్టేళ్లు అమ్మవారికి బలిస్తారు. ఒక వారంలో కనీసం 500కుపైగా బలిచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. వీటి చర్మాలను ఒక్కొక్కటి రూ.250 నుంచి రూ.350 వరకు గతంలో భక్తుల నుంచి వ్యాపారస్తులు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ఉచితం పేరుతో లాగేసుకుంటున్నారు!
భక్తులు అమ్మవారికి పొటేళ్లు, మేకపోతులు బలిచ్చిన తర్వాత తలకాయను దేవస్థానం వద్ద వేలం పాటలో కై వసం చేసుకున్న లీజుదారుడికి ఇవ్వాలి. ఆ తర్వాత ఆలయ సమీపంలో మటన్ కటింగ్ షాపుల నిర్వహకులు భక్తుడు తీసుకెళ్లిన జంతువులకు చర్మాన్ని తీసి, మటన్ కట్ చేసి ఇస్తాడు. ఆ సమయంలో తీసిన చర్మాన్ని అతనే దేవస్థానానికి ఇచ్చేయాలని నమ్మబలుకుతున్నాడు. అలా సేకరించిన చర్మాన్ని తమ్ముళ్ల అండతో సొంతం చేసుకున్న వ్యాపారికి అప్పజెబుతున్నారు.
దోచిపెట్టేస్తారా?
బోయకొండ గంగమ్మ ఆలయంలో ఎలాంటి టెండర్లు, వేలం పాటలు నిర్వహించాలన్నా, దేవదాయశాఖ కమిషనర్ అనుమతి ఉండాలి. పత్రికా ప్రకటనలు, కరపత్రాల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి. ఆ తర్వాత బహిరంగంగా వేలం పాటలు చేపట్టాలి. అయితే ఈఓ ఏకాంబరం అండదండలతో నింబంధనలేవీ పాటించకుండా తమ్ముళ్లకు దోచిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. వాళ్లు చెప్పినవన్నీ తలూపి అక్రమార్జనకు దాసోహమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమ్ముళ్ల దాదాగిరి
చౌడేపల్లె మండలం, పెద్దూరు గ్రామానికి చెందిన ఓ వ్యాపారి బోయకొండలో జంతు వుల చర్మాన్ని ఉచితంగా సేకరించి విక్ర యించుకునేందుకు తమ్ముళ్ల నుంచి అను మతి పొందాడు. దీనికి ప్రతిఫలంగా త మ్ముళ్లు రూ.20 లక్షలు డిమాండ్ చేయగా.. ఇప్పటివరకు ఆ వ్యాపారి రూ.15 లక్షలు ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ మొత్తాన్ని దేవస్థానానికి సైతం చెల్లించక తమ్ముళ్లు తమ జేబులు నింపుకోవడం గమనార్హం.
గంగమ్మ సొమ్ము తినేస్తున్నారు
బోయకొండ గంగమ్మ సొమ్మును అక్రమంగా తినేస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండి పడకుండా కలెక్టర్, దేవదాయశాఖ కమిషనర్ స్పందించి అడ్డుకట్ట వేయాలి.
– భక్తులు, స్థానికులు