
కట్టుదిట్టంగా పది సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ, మే 19 నుంచి 24వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పదవ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాల్లో 8,765 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 9 కేంద్రాల్లో 2,182 మంది, పది పరీక్షలకు 12 కేంద్రాల్లో 670 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాలని ఆదేశించారు.
మూడో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో స్వర్ణాంద్ర–స్వచ్ఛాంధ్రాలో మొక్కలు నాటే కార్యక్రమం తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మూడవ శనివారం పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి కార్యాలయాల పరిధిలో 5 నుంచి 10 మొక్కలు నాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కనీసం 2 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు.