
వసతుల కల్పనలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు విచ్చేసే పర్యాటకుల వసతుల కల్పన విషయంలో అలసత్వం వద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో ఆయన వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారితో చర్చించాలన్నారు. అందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
నిర్మాణాలు పరిశీలించాలి
జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఇంటి నిర్మాణాల పురోగతిని తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ శాఖ అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకంలో జిల్లాలో మంజూరు చేసిన గృహాలను వేగవంతంగా చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు రూఫ్ లెవెల్, రూఫ్ లెవెల్ కాస్ట్ లో ఉన్న గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు రెండు రోజుల్లో 10 గ్రామాలను పరిశీలించి మెటీరియల్ కాంపొనెంట్ లో చేపట్టే పనుల వివరాల నివేదికను డ్వామా పీడీ సమర్పించాలన్నారు. సమీక్షల్లో డీఎఫ్‌ఓ భరణి, పర్యాటకశాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరి, జిల్లా దేవదాయశాఖ అధికారి చిట్టెమ్మ, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, డ్వామా పీడీ రవికుమార్ పాల్గొన్నారు.
మొగిలి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళికలు
జిల్లాలో మొగిలి దేవస్థానం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుప్పంలోని ననియాల ఎకో టూరిజం, కంగుంది, పాలారు రివర్ ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. కాణిపాకం, బోయకొండ దేవస్థానాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి, ప్రసాదం స్కీంకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు వెల్లడించారు.