
అభివృద్ధిని విస్మరించి!
హామీలు అటకెక్కించి..
ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబు
● అక్రమ వ్యాపారాలే కూటమి ప్రభుత్వ అజెండా ● కుప్పానికి రూ.1200 కోట్ల పనులు ఎక్కడ? ● ఏడాది పాలనపై కుప్పం ఎమ్మెల్సీ భరత్ ధ్వజం
కుప్పం: ‘ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలతో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు.. విద్య, వైద్యం అందక పేదలు అల్లాడిపోతున్నారు. తన సొంత ని యోజకవర్గం కుప్పంలో అభివృద్ధి జాడేలేదు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని కుప్పం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది పాలనపై ఆయన గళం ఇప్పారు. ఇంకా ఏమన్నారంటే..!
తుస్‌మన్న సూపర్ సిక్స్
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకపోగా, వాటిపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. తన స్వార్థం కోసం దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తారని భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ఎక్కడ చూసినా అక్రమాలు, అక్రమార్జనే టీడీపీ ఎజెండాగా మారిపోయింది. విచ్చలవిడిగా దోచుకుతింటున్నారే తప్ప ఏమాత్రం ప్రజలను పట్టింకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని పక్కనబెట్టేశారు. అమరావతిని భుజాన వేసుకుని ప్రజల నోరుకొడుతున్నారు.
రూ.1,200 కోట్లు ఏమయ్యాయి?
కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూట మి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్టు జబ్బలు చరుస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌సీపీ హయాంలో వేసిన మురుగునీటి కాలువలు, రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమే. ని యోజకవర్గంలో బియ్యం, ఇసుక, గ్రానైట్ అక్రమ వ్యాపారాలు మితిమీరుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ టీడీపీ నాయకులు దోచుకుతింటున్నారు. గతంలో విమానాశ్రయం కోస 1,500 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఒక్క పనీ చేపట్టలేదు. ప్రస్తుతం అధనంగా పారిశ్రామిక కారిడార్ నిర్మాణం అంటూ రైతుల వద్ద నుంచి వ్యవసాయ భూములను లాక్కున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో భూములు కోల్పోయి చాలా మంది రోడ్డునపడ్డారు. పారిశ్రామక కారిడార్ పేరిట భూములు లాక్కునే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం.
కుప్పంలో శ్రుతిమించుతున్న టీడీపీ ఆగడాలు
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రామ కుప్పం ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా ప్రలోభాలు పెట్టి ఆరుగురు ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకున్నారు. అడ్డదారిలో ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకున్నారు. అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీలోనూ వైస్సార్‌సీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా కౌన్సిలర్లను ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసి తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ రెండు ఎన్నికల్లోనూ దొడ్డిదారిన టీడీపీ గెలిచినా నైతిక విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదే.

అభివృద్ధిని విస్మరించి!