
టీడీపీ నాయకుడి తీరుపై నిరసన
గంగాధర నెల్లూరు: ఓ టీడీపీ నాయకుడి తీరుపై నిరసనకు దిగిన ఘటన మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గురువారం గ్రామంలోని ఓంశక్తి ఆలయానికి అనుబంధంగా మురుగునీటి కాలువ నిర్మాణానికి సర్పంచ్, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీకారం చుట్టారు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత రుషేంద్రరెడ్డి కాలువ ఏర్పాటును అడ్డుకున్నారు. దీనిపై గ్రామస్తులు నిరసనకు దిగారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు గ్రామంలో అభివృద్ధి పనుల చేపట్టడాన్ని ఓర్వలేక సదరు నేత ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకుని కాలువ పనులను అడ్డుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. వేలంలో ఆలయ మాన్యం భూమిని దక్కించుకున్న సదరు నేత ఉద్దేశపూర్వకంగా కాలువ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఎంపీటీసీ సభ్యురాలు భారతి మాట్లాడుతూ తక్షణం కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో గ్రామసభ పెట్టి తీర్మానం చేస్తామన్నారు. అలాగే వంక పోరంబోకు భూమి అన్యాక్రాంతం అయిందని, కూటమి నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను సైతం పరిశీలించి రెవెన్యూ అధికారుల డిక్లరేషన్‌తో నిర్మాణ పనులు చేపట్టకోవచ్చని తెలిపారు.