
500 గ్రాముల గంజాయి స్వాధీనం
నగరి : మండలంలోని వెంగన్నకండ్రిగ వద్ద 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు సీఐ విక్రమ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గురువారం ఉద యం గంజాయి తరలిస్తున్నట్టు సమా చారం అందింది. సిబ్బంది శేఖర్, గజేంద్ర, సత్యతో పాటు, డిప్యూటీ తహసీల్దారు మేఘవర్ణం, రెవెన్యూ సిబ్బందిని వెంటబెట్టుకొని వెంగన్నకండ్రిగ వద్ద కాపుగాసి తనిఖీలు చేపట్టగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్‌లో నగరి టౌన్ నుంచి పొదటూరు పేట వైపుగా వెళ్తున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా.. వారి వద్ద 500 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. విచారణలో తమిళనాడు పొదటూరుపేట, విలాసపురం చెందిన ధనుష్(21), అతనితో పాటు ఇద్దరు మైనర్లు కరకంటాపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు మణికంఠ అనే వ్యక్తి దగ్గర తక్కువ డబ్బులకు గంజాయి కొనుక్కొని పొదటూరు పేటకి తీసుకెళ్లి ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నట్లు కనుగొన్నారు. ఈ మేరకు వారిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి, మోటార్ సైకిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మణికంఠ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.