
ఖాళీల గుర్తింపునకు కసరత్తు
● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీచర్ల ఖాళీలకు కుస్తీ ● ఇప్పటి వరకు 7 వేల పోస్టులు గుర్తింపు
చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోపు టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. త్వరలో టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల చేయనుండడంతో ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వేసవి సెలవుల్లో కుటుంబీకులకు దూరంగా ఉంటూ కసరత్తు చేస్తున్నా ఉన్నతాధికారుల నుంచి ఛివాట్లు తప్పడం లేదని విద్యాశాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులుగా కుస్తీ
గత వారం రోజులకు పైగా చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని బదిలీల కసరత్తు నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ 2 హెచ్‌ఎంలు ఒకే పాఠశాలలో ఐదేళ్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, ఎస్జీటీలు ఎనిమిదేళ్లు ఒకే చోట పనిచేస్తే విధిగా బదిలీ కావాల్సి ఉంటుంది. వీరితో పాటు మిగిలిన టీచర్లు, హెచ్‌ఎంలు ఐచ్ఛిక బదిలీకి దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లాలో కచ్చితంగా బదిలీ కావాల్సిన గ్రేడ్–2 హెచ్‌ఎంలు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్‌లు, ఎస్జీటీలు 4,478 మంది వరకు ఉన్నారు.
7 వేల ఖాళీల గుర్తింపు
కసరత్తులో ఈ నెల 15వ తేదీ వరకు 7 వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. క్లియర్ వెకెన్సీలు 1,500, ఎనిమిది, ఐదేళ్లు పూర్తయిన ఖాళీలు 3 వేలు, సర్‌ప్లస్, కొత్త పోస్టులు 500, పాఠశాలల పున:వ్యవస్థీకరణ కసరత్తులో కొత్తగా, సర్‌ప్లస్, బదలాయింపు పోస్టులు 2 వేలు మొత్తం 7 వేల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గుర్తించినట్లు విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ ఖాళీల సంఖ్య కసరత్తు పూర్తి అయ్యే సరికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సమాచారం
క్లియర్ ఖాళీ పోస్టులు: 1,500
8/5 సంవత్సరాలు పూరైన పోస్టులు: 3,000
సర్‌ప్లస్, కొత్త పోస్టులు: 500
పున:వ్యవస్థీకరణలో
గుర్తించిన పోస్టులు: 2,000
ఇప్పటి వరకు గుర్తించిన
ఖాళీ పోస్టులు: 7,000
పకడ్బందీగా కసరత్తు
రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సూచించిన ప్రకారం బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు పకడ్బందీగా చేపడుతున్నాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోస్టుల ఖాళీల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశాం.
– వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు

ఖాళీల గుర్తింపునకు కసరత్తు