
రోగులకు మెరుగైన వైద్యం
బంగారుపాళెం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధారాణి ఆదేశించారు. గురువారం బంగారుపాళెం సీహెచ్‌సీ, తుంబకుప్పం పీహెచ్‌సీని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని ఆదేశించారు. రోగులకు అందించే సేవల వివరాలను ఈహెచ్‌ఆర్(ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్)లో నమోదు చేయాలని సూచించారు. సస్పెక్ట్ కేసులను వైద్యాధికారి ధ్రువీకరించి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స అందించి పర్యవేక్షించాలని తెలిపారు. చంటి బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని తెలిపారు. డీపీఎంఓ డాక్టర్ ప్రవీణ, డాక్టర్ అనుషా పాల్గొన్నారు.
కొత్త ఆవిష్కరణలే లక్ష్యం
● ఏపీఈసెట్‌లో 8వ ర్యాంకు సాధించిన జీవ
వెదురుకుప్పం: కొత్త ఆవిష్కరణల వైపు దృష్టి సారిస్తానని ఏపీఈసెట్ 8వ ర్యాంకర్ జీవ స్పష్టం చేశాడు. మండలంలోని సీఆర్‌కండ్రిగ దళితవాడకు చెందిన మరకాలకుప్పం దేవరాజులు, సత్తెమ్మది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండవ కుమారుడు ఎం.జీవ తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో 2024లో డీఫార్మసీ పూర్తిచేశాడు. ఈనెల 6న జరిగిన ఏపీ ఈసెట్‌లో ఫార్మసీ మెడిసిన్‌లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. భవిష్యత్‌లో ఫార్మా ఇండస్ట్రీస్‌లో కొత్త ఆవిష్కరణలు(రీసెర్చ్) చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు జీవ పేర్కొన్నాడు. బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చేసి పీహెచ్‌డీతో డాక్టరేట్ సాధించలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్టు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. శాంతమ్మ జార్ఖండ్‌కు చెందిన గోపి(64) చిత్తూరు నగరంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. గురువారం సాంబయ్యకండ్రిగ సచివాలయ పరిసరాల్లోని ముళ్లపదల్లో ఓ వ్యక్తి స్ఫృహ తప్పి పడిపోయి ఉండడంతో స్థానికులు గుర్తించారు. పరిశీలించగా అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మహిళ అదృశ్యం
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం పంచాయతీకి చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్టు ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నుంచి కనబడడం లేదని పేర్కొన్నట్టు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 9440900687 నంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు.