
చిత్తూరులో మెడికల్‌షాపు సీజ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాపును సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన గురువారం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. అక్రమంగా లింగ నిర్థారణ చేస్తున్న ముఠాను కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అక్రమ నిర్వాహకులను పోలీసులకు అప్పగించారు. ఆపై పోలీసు విచారణను ముమ్మరం చేశారు. విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా డ్రగ్స్ కంట్రోల్ ఏడీ హరిప్రసాద్ రంగంలోకి దిగారు. పొన్నియమ్మ గుడివీధిలోని మెడికల్ షాపులపై మెరుపుదాడులు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టుబడ్డ మహిళల్లో చిత్తూరుకు చెందిన సునీత, తేజేశ్వరి ఉన్నారన్నారు. సునీత అనే మహిళకు పొన్నియమ్మ గుడివీధిలోని వినోద్ మెడికల్ షాపు, సుధా మెడికల్ షాపుకు సంబంధాలున్నాయని తెలిపారు. వినోద్ మెడికల్ షాపు నిర్వాహకుడు వినోద్ సునీత భర్తన్నారు. ఈ షాపును భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ షాపులో గాలించగా అబార్షన్ల కిట్లు గుర్తించామన్నారు. అలాగే వాడిన కిట్లు కూడా దొరికాయన్నారు. పెయిన్ కిలర్స్ ముందులు లభ్యమైనట్టు తెలిపారు. అంతకు ముందు చిరంజీవి అనే వ్యక్తి ఈ షాపును నడిపాడన్నారు. అతన్ని కూడా విచారించామన్నారు. డ్రగ్స్ అధికారులకు ఎలాంటి అనుమతి లేకుండా చిరంజీవి, వినోద్‌కు ఈ షాపు అప్పగించినట్లు తెలుసుకున్నామన్నారు. దీంతో వినోద్, చిరంజీవిపై కేసు నమోదు చేయడంతో పాటు షాపును సీజ్ చేసినట్టు వెల్లడించారు. సుధా మెడికల్ షాపులో కూడా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ షాపులో మందులు, మాత్రల విక్రయాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేవన్నారు. ఇక శ్రుంగార సామార్థ్యాన్ని పెంచే మాత్రలు బయటపడ్డాయన్నారు. వాటి విక్రయాలకు సంబంధించిన బిల్లులు లేవని, త్వరలో నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకంటామని ఆయన పేర్కొన్నారు.