
కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం
కార్వేటినగరం : కూటమి ప్రభుత్వంలో దళితులకు న్యాయం కరువైందని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి దళితులను అణగదొక్కడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. చంద్రబాబు గత చరిత్ర చూస్తే చుండూరు, కారంచేడు ఘటనలు మరవక ముందే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత గ్రామాన్నే వెలివేయడం దారుణం అన్నారు. ఇంత జరుగుతున్నా అగ్ర కులస్తులపై కూటమి ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల శ్రీరంగరాజపురం మండలం పుల్లూరు దళితవాడ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో దళిత గ్రామంలో అగ్రవర్ణ కులస్తులు విరుచుకుపడి ఇళ్లను, ఇంట్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా.. దళితులకు ఏసీలు, కూలర్లు, ప్రిజ్‌లు అవసరమా అంటూ దుర్బాషలాడుతూ ధ్వంసం చేశారన్నారు. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అడుగడుగునా దళితులకు అవమానం తప్పడం లేదని ఆరోపించారు. దళితులు ఆర్థికంగా, రాజకీయంగా అధికారకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు.