
వాహనాన్ని ఢీకొని కారు దగ్ధం
తవణంపల్లె : స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని కారు ఢీకొంది. దీంతో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఆర్పేందుకు స్థానికులు, పోలీసు సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా.. తిరుపతికి చెందిన తేజ, మరో వ్యక్తితో కలిసి టి.పుత్తూరులో గంగ జాతరకు విచ్చేశారు. ఉత్సవాలను ముగించుకొని తిరిగీ ఇంటికి బయలుదేరారు.
ఈ నేపథ్యంలో తవణంపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట స్పీడు బ్రేకర్ వద్ద రెండు వాహనాలు మెల్లగా దాటుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఐషర్ వాహనాన్ని ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఇద్దరు బయటకు దిగేశారు. కొంత సేపటికే కారులో హఠాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీనిపై తవణంపల్లె పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని వివరించారు.
కాలువలో పడి వృద్ధుడి మృతి
బైరెడ్డిపల్లె : మండలంలోని కామినేపల్లె గ్రామానికి చెందిన శంకరప్ప (80) మురుగు నీటి కాలువలో పడి బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు ..కామినేపల్లె గ్రామానికి చెందిన శంకరప్పకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బైరెడ్డిపల్లె వద్ద వెళుతుండగా మెయిన్‌రోడ్డు సమీపంలోని మురుగు నీటి కాలువలో అదుపు తప్పి పడి మృతి చెందాడు. పంచాయతీ సిబ్బంది గమనించి మృతి చెందిన వృద్ధుడిని బయటకు తీశారు. చుట్టు పక్కల ప్రాంతాల వారు గుర్తించి కామినేపల్లె శంకరప్పగా నిర్ధారించారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసి మృతదేహాన్ని అప్పగించారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
పుత్తూరు : మున్సిపాలిటి 20వ వార్డు నెత్తం దళితవాడకు చెందిన జి.బలరాం(64) బుధవారం వడదెబ్బ తగిలి మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం ఒక్కసారిగా విరేచనాలు, వాంతులు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.