
గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
● అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టాలు ● పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
చిత్తూరు కలెక్టరేట్ : గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వీడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణ ప్రక్రియలో ఆసక్తి ఉన్న లబ్ధిదారులను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల ప్రక్రియలో లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, రుణాల మంజూరుపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. గృహ నిర్మాణాలు ప్రారంభించి త్వరితిగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మొత్తం 77,366 గృహాలు మంజూరు కాగా ఇందులో 50,539 గృహాలు పూర్తి అయినట్లు తెలిపారు. బిల్లుల మంజూరులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదన్నారు. ఏవైనా ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
అర్హత ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు
జిల్లాలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు కచ్చితంగా మంజూరు చేయాలని అడిషనల్ సీసీఎల్‌ఏ ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు. జిల్లా పరిధిలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న రీ సర్వే కసరత్తును ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామన్నారు. రీ సర్వే ప్రక్రియలో ప్రతి ఫైల్‌ను జేసీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ భూములు, కోర్టు కేసులకు సంబంధించిన భూములు పరిశీలించి రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మోహన్‌కుమార్, ఏఓ కులశేఖర్ పాల్గొన్నారు.