
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శాంతిపురం : మండలంలోని కడపల్లి పంచాయతీ శివపురంలో నిర్మించిన సీఎం చంద్రబాబు నివాసాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. ఈనెల 25న ఇక్కడ గృహ ప్రవేశం కోసం సీఎం వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎస్పీ పర్యటించారు. ఇంటిని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ, అంబులెన్స్, పార్కింగ్ తదితర సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులు, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ పార్థసారధి, రూరల్, అర్బన్ సీఐలు మల్లేష్ యాదవ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల దాణా
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల పశువుల దాణా కేటాయింపు జరిగిందని, వారంలో రోజుల్లో పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ అరీఫ్ తెలిపారు. ఇందులో భాగంగా 31 మండలాల నుంచి కావాల్సిన రైతు వివరాలను సేకరిస్తున్నామన్నారు. దాణా పూర్తి ధర రూ.22 అయితే పాడి రైతుకు 50 శాతం రాయితీతో రూ. 11 అందిస్తామని పేర్కొన్నారు.
ఈనెల 17కు హుండీ లెక్కింపు
చిత్తూరు రూరల్(కాణిపాకం) : కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు వాయిదా వేసినట్లు ఈఓ పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరగాల్సిన ఈ లెక్కింపు ఈనెల 17వ తేదీకి వాయిదా వేశామన్నారు. భక్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది ఈ విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు.