
ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు!
– దర్జాగా కూటమి నేతల ఆక్రమణ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, గ్రావెల్ తోపాటు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్వేటినగరం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 419/2లో రూ.లక్షలు విలువ జేసే ప్రభుత్వ భూమిని పార్టీ కార్యాలయ నిర్మాణం పేరుతో ఆక్రమణకు దిగారు. ఈ మేరకు కూటమి నాయకులు బుధవారం భూమి చదును చేసే పనులు చేపట్టారు. అయితే అదే సర్వే నంబర్ పక్కనే ఉన్న రైతులు పనులను అడ్టుకుని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే భూమిలో ఉపాధి పథకం నిధులతో పారంఫాండ్ల పనులు చేపట్టారు. అయినప్పటికీ కూటమి నాయకులు పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూల్చి ప్రభు త్వ భూములను దర్జాగా ఆక్రమిస్తున్నారు. అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా సర్వే నంబర్ 419/2లో చెట్లను నరికి భూమిని చదును చేస్తున్నట్లు రైతులు సమాచారం ఇచ్చారని, వెంటనే పనులను నిలిపి వేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.