
చక్రస్నానం.. భక్తజన పునీతం
● నేడు పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తం
గంగవరం: మండలంలోని టీటీడీ అనుబంధ కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చక్రస్నానం వైభవోపేతంగా జరిగింది. వేకువజామున స్వామివారికి సుప్రభాతసేవ, తోమాలసేవ, అర్చన తదితర నిత్య కై ంకర్యాల అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీకోనేటిరాయస్వామివారు తిరుచ్చిపై గ్రామ మాడ వీధుల్లో ఉరేగుతూ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ కంకణబట్టార్ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఉభయదారులకు, చక్ర తాళ్వారుకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చక్ర తాళ్వారుకు పుష్కరిణిలో అవబృథస్నానం చేయించారు. అదే సమయంలో అశేష భక్తులు గోవింద నామస్మరణలతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమంతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేడు బుధువారం సాయంత్రం శ్రీవారి పుష్పయాగం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ ఈఓ వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నీరుకుండ గజేంద్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు.