
బోయకొండలో
వేలం పాట జరిగి 60 రోజులైనా చెల్లించని సొమ్ము
రూ.2కోట్లకు పైగా తమ్ముళ్ల ఎగనామం!
పట్టనట్టు వ్యవహరిస్తున్న ఈఓ ఏకాంబరం
బోయకొండ గంగమ్మ ఆలయంలో అవినీతి అనకొండలు అల్లుకుపోయాయి. ఓ వైపు వేలం పాటదారులు డబ్బులు చెల్లించకపోయినా ప్రశ్నించే వారే లేకుండా పోయారు. ఈఓ కూటమి నేతలకు వత్తాసు పలుకుతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానానికి రావాల్సిన సొమ్ము వసూలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి టా్‌స్క్‌ఫోర్సు: పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ దేవస్థానం కూటమి నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి అమ్మవారి సొమ్ముతోపాటు అధిక ధరలు పెంచి భక్తుల జేబులు గుల్ల చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగడం రివాజుగా మారుతోంది. దేవస్థానం వద్ద వివిధ హక్కులపై ఏడాది పాటు లీజుకిస్తూ నిర్వహించిన వేలం పాటల ద్వారా రూ.4.63 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వేలంలో హక్కులు పొందిన టీడీపీ నేతలు సుమారు రూ.2 కోట్లకు పైగా నగదు చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై సంబంధిత ఆలయ ఈఓ ఏకాంబరం పట్టీపటనట్టు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే!
బోయకొండ ఆలయం వద్ద ఏడాదిపాటు వివిధ హక్కులను లీజుకిస్తూ మార్చి 10, 11 తేదీల్లో వేలం పాట నిర్వహించారు. ఇందులో కొన్ని వాయిదా పడడంతో వాటికి మార్చి 28న ఆలయ పరిపాలనా కార్యాలయంలో ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో వేలం పాటలు, సీల్డ్ టెండర్లు నిర్వహించారు. ఈ వేలం పాటలు ఏకపక్షంగా కూటమి నేతల అనుచరులే దక్కించుకున్నారు.
నిబంధనలకు పాతర
బోయకొండ ఆలయం వద్ద నిబంధనలు ఏవీ అమలు కావడంలేదు. వేలం పాటలో పాల్గొన్న వ్యక్తి హెచ్చుపాట దారుడి నుంచి మొత్తాన్ని అప్పటికప్పుడే దేవస్థానానికి జమ చేయాల్సి ఉన్నా ఈఓ ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు. మూడు దశలుగా జరిగిన వేలం పాటల్లో ఆలయానికి రూ.4.63 కోట్ల ఆదాయం చేకూరింది. హెచ్చుపాటదారుడి నుంచి నగదు జమ చేయకుండా లీజు హక్కు అనుభవిస్తున్నాడు. సుమారు రూ.2 కోట్లకు పైగా వేలం లీజుదారుల నుంచి నగదు రావాల్సి ఉన్నా అధికారులు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం.
మొదటి పాటదారులు చెల్లించకుంటే
వేలం జరిగిన రోజు సాయంత్రం వరకు హెచ్చుపాటదారుడు నగదు చెల్లించకుంటే మొదటి పాటదారుడు నుంచి చెల్లించిన డిపాజిట్టును ఆలయ ఖాతాలో జమ చేసుకోవాలి. ఆ లీజు విషయమై వేలంలో రెండవ పాటదారుడునికి వేలం లీజు ఇవ్వాలని దేవస్థానం వారే నిబంధనలు పెట్టారు. కానీ ఇవేవీ అమలు కాకపోవడంతో ఆలయ ఆదాయానికి గండిపడుతోంది.
అందరూ కూటమి నేతలే
వేలం పాటదారులందరూ కూటమి నేతలే. బోయకొండను వారికి రిసిచ్చేసినట్టు ఉందన్న విమర్శలున్నాయి. కలెక్టర్, దేవదాయశాఖ కమిషనర్ స్పందించి ఆలయ ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
వేలం పాటలతో ఆలయానికి రావాల్సిన ఆదాయం ఇలా..
కొండపై కొబ్బరికాయల విక్రయం, పూజా సామ గ్రి విక్రయించుకొనే హక్కు – రూ.52.5 లక్షలు
పూలు, నిమ్మకాయల హారాలు, వడిబాలు, చీరలు, జాకెట్ పీసులు విక్రయించుకునే హక్కు – రూ.42 లక్షలు
దేవస్థానం, పంచాయతీకి చెందిన టోల్ గేటు నిర్వహించుకునే హక్కు – రూ.68.5 లక్షలు
పెద్దభోగం, చిన్నభోగం సేకరించి నిర్వహించుకునే హక్కు– రూ.86.15 లక్షలు
భక్తాదులు సమర్పించే చీరలు, రవికలు, పావడా పీసులు సేకరించుకొనే హక్కు – రూ.46.5 లక్షలు
కొండపైన క్యాంటీన్, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ విక్రయించుకునే హక్కు– రూ.20.90 లక్షలు
కొండ కింద క్యాంటీన్, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ విక్రయించుకునే హక్కు – రూ.6.35 లక్షలు
కొండపైన నాలుగు దుకాణాల్లో పవిత్ర దారాలు, టాయ్స్, ఫొటోలు, కలకండ విక్రయించుకునే హక్కు – రూ.69 లక్షలు
కోళ్లు విక్రయించుకునే హక్కు– రూ.6.80 లక్షలు
ఫొటోలు తీసుకొనే హక్కు – రూ.1.79 లక్షలు
కొబ్బరి పై చిప్పలు సేకరించుకునే హక్కు – రూ.7.4 లక్షలు
తలనీలాలు సేకరించుకొనే హక్కు – రూ.24.6 లక్షలు
క్లాక్ రూములు, సెల్‌ఫోన్ లగేజీ నిర్వహించుకొనే హక్కు – రూ.18.2
పేపరు కవర్లు, బ్యాగులు విక్రయించుకునే హక్కు– రూ.6.6 లక్షలు
పాదరక్షలు భద్రపరుచుకునే హక్కు – రూ.2.4 లక్షలు
దేవస్థానం స్థలంలో తాత్కాలిక అంగళ్లు ఏర్పాటు, వ్యాపారం చేసుకునే హక్కు రూ.3.26 లక్షలు

బోయకొండ గంగమ్మ ఆలయ ముఖచిత్రం

బోయకొండలో