
అయ్యోర్ల బదిలీకి కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయ్యోర్ల బదిలీకి జిల్లా విద్యాశాఖ కసరత్తు చేపడుతోంది. ఒకే పాఠశాలలో ఐదేళ్లు పనిచేసిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు నిండిన మిగిలిన కేడర్ల టీచర్లకు బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 4,478 మంది టీచర్ల బదిలీ!
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఒకే పాఠశాలలో పనిచేస్తూ ఐదేళ్లు నిండిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు నిండిన మిగిలిన కేడర్ల టీచర్లకు బదిలీలు తప్పనిసరిగా ఉండనున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 4,478 మందికి తప్పనిసరిగా బదిలీలు ఉండొచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రెండేళ్లు నిండినవారు సైతం బదిలీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
బడులు తెరిచే లోపు..!
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యే లోపు బదిలీలు, ఉద్యోగోన్నతులు పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఈనెల 13న రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం బదిలీలు, ఉద్యోగోన్నతులు వరుసగా చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాలో మే నెలాఖరు వరకు పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలు వెంటనే ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల నుంచి సేకరించడం మొదలు పెట్టారు. రెండు రోజుల్లో ఏకేడర్‌లో ఎన్ని ఖాళీలు, ఎక్కడెక్కడ ఉన్నాయో తేల్చేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రేషనలైజేషన్ ప్రక్రియ
117 జీవోకు ప్రత్యామ్నాయంగా జీవో ను విడుదల చేశారు. ఆ జీవో ఆధారంగా టీచర్ల పోస్టులను రేషనలైజేషన్ ప్రక్రియలో దాదాపు పూర్తి చేశారు. దీంతో ఎక్కడెక్కడ ఏ పోస్టు అవసరం ఉంటుందో ఒక నిర్ధారణకొచ్చారు. రేషనలైజేషన్‌లో ఆయా చోట్ల పోస్టు కోల్పోయే టీచర్లు రేషనలైజేషన్ పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు ఏదో ఒకదాన్ని తీసుకునే అవకాశం కల్పించనున్నారు.