
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనీషారెడ్డి
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకురాలు నూతన కాల్వ అనీషారెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నియామకపు ఉత్తర్వులను విడుదల చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అనీషారెడ్డి, ఆమె భర్త నూతన కాల్వ శ్రీనాథరెడ్డి పార్టీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. వారి సేవలను గుర్తిస్తూ మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి సూచనల మేరకు ఆమెకు పదవి వచ్చేలా చర్యలు చేపట్టారు. అనీషారెడ్డి మాట్లాడుతూ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.