
అంతా నా ఇష్టం!
● డీఎస్పీ వాహనాన్ని లాగేసుకున్నా నోరెత్తకూడదు ● యూనియన్ ఆఫీస్‌ను ఖాళీ చేయించేందుకు యత్నం ● ‘బాస్’కు వాస్తవాలు చెప్పలేక కుమిలిపోయిన ఖాకీలు ● చిత్తూరు ‘ఏఆర్’లో ‘సూపర్‌బాస్’గా చెలామణి
చిత్తూరు అర్బన్: ఆర్ముడు రిజర్వు (ఏఆర్)..లా అండ్ ఆర్డర్. పోలీసుశాఖకు ఈ రెండూ గుండెకాయ, మెదడు లాంటివి. ఏ ఒక్క విభాగంలో చిన్న తేడా వచ్చినా.. ఒకరి ఒంటెద్దు పోకడతో ఇంకొకరికి ఇబ్బందులు తప్పవు. చిత్తూరు పోలీసుశాఖలోని ఏఆర్ విభాగంలో ‘చిన్నబాస్’గా చలామణి అవుతున్న ఓ వ్యక్తి ఏకంగా తనకు తానే ‘సూపర్‌బాస్’ అనుకుని భ్రమలో ఉన్నతాధికారులపైనే కాలు దువ్వాడు. విషయం ‘బాస్’ ఎదుట కక్కలేక, తమలో తాము మింగలేక చాలా మంది ఖాకీ అధికారులు లోలోపల కుమిలిపోయారు. ఉదయించిన ‘భాస్కరు’డు అస్తమించిక తప్పదన్నట్లు.. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన ఒక్కో ఘన కార్యం వెలుగులోకి వస్తోంది.
ఎవరైనా లెక్కలేదంతే..
జిల్లా పోలీసుశాఖలో ఎస్పీ తరువాత ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఆర్డర్ వారీగా ఉంటారు. ఇందులో ఓ కానిస్టేబుల్ డీఎస్పీతో మాట్లాడాలంటే ఓ విధానం ఉంది. అదే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌తో మాట్లాడలన్నా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఏఆర్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా ఏఎస్పీలనే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాట్లాడుతున్నట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక డీఎస్పీ అంటే అస్సలు లెక్కలేదు. కనీసం తనతోటి ర్యాంకు ఉన్న వ్యక్తితో ప్రవర్తించే తీరు కూడా వివాదస్పదమే. జిల్లా పోలీసుశాఖలో పనిచేసే ఓ డీఎస్పీ తనకు ఆరోగ్యం బాగాలేదని సెలవుపై వెళ్లారు. ఈ సమయంలో వాహనాన్ని హెడ్‌క్వార్టర్‌కు అప్పగించారు. తిరిగొచ్చి వాహనం అడిగితే, ఎవరూ సమాధానం చెప్పలేదు. తీరా విచారిస్తే ఆ సూపర్‌బాస్ డీఎస్పీ వాహనాన్ని మరో ప్రాంతానికి పంపేసినట్లు తెలుసుకున్నారు. ఇప్పటికే తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రయాణానికి అనుగుణంగా ఉండేందుకు రూ.లక్ష వరకు తన వాహనానికి ఖర్చు చేశానని, దాన్ని తిరిగి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా ఆ వ్యక్తి అస్సలు పట్టించుకోలేదని సమాచారం. అసలు తనకు ఎందుకు ఫోన్ చేశారంటూ ఎదురు ప్రశ్నించి, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ అధికారి కుంగిపోయి తనకు జరిగిన అవమానం ఎవరికీ చెప్పకుండా మదనపడిపోతున్నారు.
నీడను కూల్చే యత్నం..
నాలుగు వేల మందికి పైగా సిబ్బంది ఉన్న పోలీసుశాఖకు జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయం పెట్టుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా ఖాకీలు వస్తే యూనియన్ ఆఫీస్‌లో కాసేపు సేదతీరి, తమతోటి సిబ్బందిని పలకరించడానికి ఓ నీడ ఉందనే ఆనందంలో ఉన్నారు. కానీ యూనియన్ వాళ్లతో గిట్టని ఆ ‘సూపర్‌బాస్’ ఏకంగా ఆ కార్యాలయాన్నే ఖాళీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఏఆర్ కార్యాలయం లోపల యూనియన్ ఆఫీస్ ఎలా పెట్టుకుంటారని, దీన్ని ఖాళీ చేయాలని ఖాకీలపైనే ఒత్తిడి తీసుకొచ్చాడు. విషయం ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెబితే ఏం జరుగుతుందోనని యూనియన్ నాయకులు సైతం నోరెత్తలేదు. తీరా విషయం బాస్‌కు తెలియడంతో ఆయన కల్పించుకోవడంతో యూనియన్‌కు నిలవడానికి నీడైనా దొరికినట్లయ్యింది. అన్నింటికీ ఒక్కటే కారణం.. ‘ఏయ్ నేను ఇంతకు ముందు ఎక్కడ పనిచేశానో తెలుసా..? సీఎం పేషీకు ఫోన్ చేయమంటావా..?’ అనే మాటలు అందరి నోళ్లు మూయించేశాయి. మరి ఆ పేషీ నుంచే ‘సూపర్‌బాస్’కు మళ్లీ జిల్లాలో పనిచేయడానికి ఆదేశాలు వస్తాయో..? ఏకంగా సీఎం వద్దే బాధ్యతలు నిర్వర్తించే భాగ్యం దక్కుతుందో వేచి చూడాలి.