
పటిష్టంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈఓ శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై ఛీప్, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ పరీక్షలకు 15,377 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ చాలా ముఖ్యమైనవన్నారు. పరీక్షల నిర్వహణలో అనుభవం ఎంతో నేర్పిస్తుందన్నారు.
ద్విచక్ర వాహనాల్లో ప్రశ్నపత్రాలు తీసుకెళ్లవద్దు
ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్లకూడదని పరీక్షల డీఈసీ కన్వీనర్ దయానందరాజు వెల్లడించారు. చెడ్డపేరు తెచ్చుకోకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ విధులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ తీరు ఒకటే అయినప్పటికీ కొత్త కొత్త నిబంధనలు వస్తుంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రంలో చీఫ్, డిపార్ట్‌మెంట్ అధికారులే బాస్‌లని తెలిపారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థినీ తనిఖీ చేసిలోనికి పంపాలన్నారు. ప్రాంగణంలో చిట్టీలు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పోలీసులు గేట్ లోపల సెల్‌ఫోన్ వినియోగించకూడదని తెలిపారు.
సెట్ పరిశీలనలో జాగ్రత్తలు ముఖ్యం
ఏ రోజుకు ఆరోజు ఉన్నతాధికారులు సూచించే ప్రశ్నపత్రాల సెట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని డీఐసీ సభ్యుడు శరత్ చంద్ర అన్నారు. పరీక్షల నిర్వహణలో చెక్‌లిస్ట్‌ను అనుసరించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు ముందుగా చేరుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లేటప్పుడు సెట్ నంబర్లను జాగ్రత్తగా పరిశీలించుకుని తీసుకెళ్లాలన్నారు. ప్రశ్నపత్రాలు తక్కువ రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ప్రశ్నాపత్రాలు ఇచ్చే సమయంలో మీడయం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.