
సచివాలయ భవన ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ
● జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ
వి.కోట: మాట ఇస్తే మడమతిప్పని నాయకుడెవరైనా ఉన్నారంటే అది మన సీఎం జగనన్నే అని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. వీరు మండలంలోని కృష్ణాపురంలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయ భవనం, డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం, గోనుమాలపల్లి, కుంభార్లపల్లి, ఓగు, బీసీ పల్లిలో రైతు భరోసా కేంద్రాలను ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. దీంతోపాటు ఎస్ బండపల్లి సచివాలయ పరిధిలోని బెల్లకుంట, ఆరిమాకులపల్లి, నెర్నిపల్లి సచివాలయ పరిధిలోని రామాపురం, పైపల్లి, బోడిగుట్లపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని బోడిగుట్లపల్లి గ్రామాల్లో సీఎండీఎఫ్, జీజీఎంపీ, నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. పాముగానిపల్లి సచివాలయంలోని నూతన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవనాలను అట్టహాసంగా పండగ వాతావరణంలో ప్రారంభించారు. వారు ప్రసంగిస్తూ ఒక్కొక్క సచివాలయానికి రూ.40 లక్షలు, ఒక్కో రైతు భరోసా కేంద్రానికి రూ.21.8 లక్షలు, ఒక్కో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌కు రూ.20.80 లక్షలు సీఎండీఎఫ్, జీజీఎంపీ నిధులతో రామాపురంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, ఆరిమాకులపల్లి, బెల్లకుంట గ్రామాల్లో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, పైపల్లి గ్రామంలో రూ.2.20 లక్షలతో సీసీ రోడ్లను నిర్మించినట్లు వివరించారు. గతంలో టీడీపీ పాలనకు ప్రస్తుతం జగనన్న అందిస్తున్న పాలనకు తేడాను గమనించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ యువరాజ్, వైస్ ఎంపీపీలు తమీమ్, లక్ష్మణ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పిఎన్ నాగరాజు, ఎస్‌ఏ గౌస్, మండల కన్వీనర్ బాలగురునాథ్, మండల సచివాలయాల కన్వీనర్ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.