
సి.బండపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ భరత్
శాంతిపురం: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలందరికీ మేలు జరిగితే చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకులు, వారి బంధువులకు మాత్రమే మేలు జరిగిందని ఎమ్మెల్సీ భరత్ చెప్పారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సి.బండపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రతి పంచాయతీలో ఒకటి లేదా రెండు కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని చెప్పారు. గత ఐదేళ్లుగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. వైద్యం ఖర్చులు ఎవరికీ భారం కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఇకపై రూ.25 లక్షల వరకూ ఖరీదైన వైద్యం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారన్నారు. ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా చూస్తున్న సీఎంను ఆశీర్వదించాలని కోరారు.
మాయగాళ్లతో భద్రం
ఎన్నికల సమయంలో అబద్దాలను చెప్పడం, గెలిచాక జనాన్ని గాలికి వదిలేయటంలో ఆరితేరిన మాయగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ భరత్ చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏమి చేశారో రైతులు, డ్వాక్రా మహిళలకు బాగా తెలుసన్నారు. రానున్న ఎన్నికల కోసం మళ్లీ కొత్త హామీలతో వచ్చినా నమ్మడానికి జనం సిద్ధంగా లేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెస్కో వైస్ చైర్మన్ కోదండరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ పట్టాభి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, స్థానిక నాయకులు కుమర్‌రాజా, చంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.