
కార్వేటినగరం డైట్ కళాశాలలో1984–85 బ్యాచ్‌కు చెందిన ఛాత్రోపాధ్యాయులు
కార్వేటినగరం: వారంతా జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో 1984–85లో టీటీసీ శిక్షణ పొంది ప్రస్తుతం వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. అయితే 38 ఏళ్ల తరువాత ఒక ఫోన్‌కాల్ వారిని ఒక చోటకు చేరేలా చేసింది. ఆదివారం వారంతా ఒకేచోట కలుసుకుని చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డైట్ ప్రిన్సిపల్ (తిరుపతి జిల్లా డీఈఓ) శేఖర్ మాట్లాడుతూ టీటీసీ ప్రారంభం నుంచి నేటి వరకు జిల్లా విద్యాశిక్షణా సంస్థలో ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ గురువులుగా సేవలు అందించడాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులుగా కొలువుదీరిన మనమంతా మరెంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది సమాజంలో గురువుల గొప్పతనాన్ని చాటాలని సూచించారు. అనంతరం సర్వేపల్లె రాధాకృష్ణ చిత్రపటంతోపాటు డైట్ ప్రిన్సిపల్స్‌గా విధులు నిర్వహించి మృతి చెందిన పుల్లారెడ్డి, బ్రహ్మయ్య చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. గురువులైన డాక్టర్ యోగానందం, సుగుణకుమారి, ప్రభాకర్‌రెడ్డికి శాలువలు కప్పి గజమాలలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్, నిర్వాహకులు డాక్టర్ విజయులురెడ్డి (డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్) హమీద్‌బాషా, వేణుగోపాల్, పొన్నురంగం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.