
చిత్తూరు రూరల్ : మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమాన్ని ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ రవిరాజు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది తమ పరిధిలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోని వారికి, మధ్యలో ఆపేసిన గర్భిణులు, పిల్లలకు టీకాలు వేయనున్నట్లు చెప్పారు. ఇందుకు గాను జిల్లాలో 488 మంది గర్భిణులు, ఏడాదిలోపు పిల్లలు 1,236 మంది, 1–5 ఏళ్లలోపు పిల్లలను 991 మందిని గుర్తించామన్నారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వరసిద్ధుని దర్శనానికి 6 గంటలు
కాణిపాకం(యాదమరి): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత వారం రోజులుగా అయ్యప్పమాల ధారణ భక్తులు, సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి తరలి రావడంతో దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి కంపార్ట్‌మెంట్‌లు, రూ.150, రూ.100, ఉచిత క్యూలు, భక్తులతో నిండిపోయి ఆలయం వెలుపల వరకు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేశు అధికారులు తగు ఏర్పాట్లు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వికలాంగులకు, వృద్ధులకు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూల ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు.
నేడు కలెక్టరేట్‌లో స్పందన
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో స్పందన నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే స్పందనకు అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. గైర్హాజరైతే శాఖాపరంగా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
ఇన్‌చార్జి కలెక్టర్‌గా శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్ : రెండు రోజుల పాటు ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ శ్రీనివాసులు వ్యవహరించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11, 12 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న సర్టిఫికేషన్ కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం బయలుదేరి వెళ్లారు. దీంతో రెండు రోజులపాటు ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసీ శ్రీనివాసులు విధులు నిర్వర్తించనున్నారు. కలెక్టర్ షణ్మోహన్ ఈ నెల 13న జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారు.

భక్తులతో నిండిపోయిన క్యూలు