
ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయించుకున్న వ్యక్తిని పలకరిస్తున్న ఆరోగ్య శ్రీ అధికారులు
ఆరోగ్య ఆసరా వివరాలు
సంవత్సరం లబ్ధిదారుల జమ
సంఖ్య (రూ.కోట్లల్లో)
2019–20 6,310 3.62
2020–21 17,286 90.01
2021–22 30,285 13.99
2022–23 43,065 20.01
2023–24 27,816 13.25
మొత్తం 1,24,762 140.88
● వైద్య వ్యయం రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీతో చికిత్స
● వ్యయ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంపు
● ఈ నెల 18 నుంచి అమలుకు శ్రీకారం
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటాసుమారు 80 వేల మందికి లబ్ధి
చిత్తూరు రూరల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాల వరకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులున్నాయి. వీరికి 56 ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా చికిత్స అందుతోంది ఈ ఆస్పత్రుల్లో. ఏటా 80 వేల నుంచి లక్ష మంది వరకు ఆరోగ్యశ్రీతో వైద్య సేవలను పొందుతున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.62 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ఆసరా కింద రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు బాధితులకు బ్యాంకు ఖాతాకు జమ చేస్తోంది. వీటితో పాటు జబ్బుల సంఖ్యను పెంచుతూ ప్రస్తుతం 3,257 వ్యాధులకు చికిత్స అందేలా ప్రభుత్వం పేదలకు ఊపిరిపోస్తోంది.
గత టీడీపీ పాలనలో...
గత టీడీపీ పాలనలో ప్రభుత్వ వైద్యం కంటే నాటు వైద్యమే నయం అనే దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో సరిపడినంత సిబ్బంది ఉండరు. సమయపాలన, నిర్వహణ లోప సమస్యలతో ప్రభుత్వ వైద్యం పేదలను ఆమడదూరంలో నిలబెట్టింది. జనం నొప్పులు భరించలేక ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు పెట్టేవాళ్లు. ఇలా ప్రాథమిక స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆస్పత్రి వరకు సేవలు అరకొరగా అందేవి. మందు బిల్లలు మింగుడుపడేవి కావు. ఈ కారణంగా పేదలకు వైద్య కష్టాలు భారంగా మారాయి. ఆరోగ్య శ్రీ సేవలను అంతంత మాత్రంగానే అందించారు. కేవలం 950 అనారోగ్య సమస్యలకు మాత్రమే అరకొర సేవలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ రాగానే...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలులోకి వచ్చాక వైద్య సేవల్లో వేగం పెరిగింది. పల్లెల్లోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు పురుడుపోసుకున్నాయి. ఫ్యామిలీ ఫిజీషియన్‌తో పల్లెలోనే సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. తలుపుతట్టి గడపవద్దే వైద్య సేవలు అందిస్తోంది. నడవలేని స్థితిలో ఉంటే డాక్టరే ఇంటి వద్దకు వెళ్లి బాగోగులు చూస్తున్నారు. ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను వెను వెంటనే పూర్తిచేస్తోంది. కావాల్సినన్ని మందులు, మాత్రలను అందుబాటులో ఉంచుతోంది. పీహెచ్‌సీలు కూడా 24 గంటలు పనిచేసేలా మార్గదర్శకాలు జారీ చేసింది. నాడు–నేడు అభివృద్ధితోపాటు అన్ని రకాల పరీక్షలు పీహెచ్‌సీలో చేస్తూ మెరుగైన చికిత్స చేస్తున్నారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్షతో గ్రామాల్లోనే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తోంది. మందులు, మాత్రలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. రెండో విడతగా క్యాంపు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్యాంపు ద్వారా మరింత మందికి పలు రకాల వ్యాధులు బయట పడడంతోపాటు ఖరీదైన వైద్యానికి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందేలా చూస్తోంది.
కొత్త కార్డులు
ఆరోగ్య శ్రీ సేవలను సులభతరంగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్డులను అందించనుంది. ఈ కార్డులను కూడా ఈ నెల 19 నుంచి లబ్ధిదారులను అందించనున్నారు. చిత్తూరు జిల్లాలో 4,92,963, తిరు పతి జిల్లాలో 5,85,897 కార్డులు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఆరోగ్యశ్రీ సేవలపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
పేదలకు మేలు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వాళ్లు చిన్న ప్రైవేటు ఆస్పత్రులకు కెళ్లి వైద్యం చేయించుకోవాలంటే వేలు, లక్షల్లో ఖర్చువుతోంది. జ్వరమని ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.1000 చేతిలో ఉండాలి. అదే కొంచెం పెద్ద వ్యాధి అయితే తట్టుకుని నిలబడలేం. అప్పటికప్పుడు అప్పోసప్పో చేయాలంటే కూడా రూ.2 లక్షలు దొరకడం కష్టం. అలాంటిది మాలాంటి పేదలకు రూ. 25 లక్షల వరకు వైద్యం చేయిస్తారంటే అది గొప్ప నిర్ణయం.
– ధనమ్మ, వేనూతనపల్లి, పూతలపట్టు
వైఎస్సార్‌తోనే ఆయుష్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్య మా అని ఆరోగ్యశ్రీ తీసు కొచ్చారు. అప్పట్లో ఎంతో మందికి ఈ పథకం ప్రాణం పోసింది. అలాంటి గొప్ప పథకానికి ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత ఊపిరి పోస్తున్నారు. రోగాల సంఖ్యను పెంచడంతోపాటు వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం మంచి నిర్ణయం.
–రాజరత్నంరెడ్డి,
ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు, చిత్తూరు
ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం
ఇప్పటికే ఆరోగ్యశ్రీపై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఆరోగ్య శ్రీకార్డుల ముద్రణ ప్రారంభమైంది. త్వరలో కార్డులన్నీ జిల్లాలకు చేరుతాయి. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం తర్వాత కొత్త కార్డులు పంపిణీ చేస్తాం. నియోజకవర్గాల వారీగా ఐదు సచివాలయాల పరిధిలో ప్రజాప్రతినిధుల చేత కార్యక్రమాలు నిర్వహించి కార్డులు ఇస్తాం. వైద్య, సచివాలయ సిబ్బంది ద్వారా ఆరోగ్య శ్రీ సేవలపై అవగాహన కార్యక్రమాలుంటాయి.
–రాజశేఖర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్, తిరుపతి


