
నాడు నేడు పథకంలో తీర్చిదిద్దిన కార్వేటినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల
గత పాలకులు సర్కారు బడులను పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యార్థులకు ఓటు లేదన్న భావనతో పాఠశాలల అభివృద్ధిని కొన్ని సంవత్సరాలపాటు విస్మరించారు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టారు. బడుల్లో వసతుల కల్పనకు వేల కోట్లను ఖర్చు చేశారు. గ్రామాల్లోని సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. ఈ పథకంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..
– చిత్తూరు కలెక్టరేట్
ఇది మా అందమైన పాఠశాల
గతంలో గదులు ఉరుస్తూ, పెచ్చులూడిపడుతూ పిల్లలతోపాటు నేను భయభ్రాంతులకు గురయ్యేవాడిని. కనీస వసతులు లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు నాడు–నేడు పథకంతో రాష్ట్ర ప్రభుత్వం లక్షలు వెచ్చించి అందమైన భవనాలుగా తీర్చిదిద్దింది. విద్యార్థులు కూర్చోవడానికి సౌకర్యవంతంగా డెస్కులు ఏర్పాటు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని సులభ పద్ధతుల్లో బోధించే విధంగా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసింది. మా పాఠశాలలో గతంలో ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 42 మంది ఉన్నారు. ఇదంతా ఈ ప్రభుత్వం ఘనతే.
– గోపీనాథ్, టీచర్, ఈదువారిపల్లి పాఠశాల, కార్వేటినగరం
గతంలో సౌకర్యాలు ఉండేవి కావు
గతంలో మా పాప చదివే పుత్తూరు జెడ్పీ హైస్కూల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. దీంతో ప్రైవేటు పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేశాం. అయితే ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. బడుల్లో అన్నిరకాల వసతులు కల్పించింది. నాడు –నేడు పథకంతో ప్రభుత్వ బడులన్నీ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రూపుదిద్దుకున్నాయి. లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించే కార్పొరేట్ బడుల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు లేవు. ఇలాంటి చదువు కూడా అక్కడ చెప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు సకాలంలోనే అందుతున్నాయి. మా పాప యువశ్రీ తొమ్మిదో తరగతి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటోంది. పేదలు చదివే పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న జగనన్నకు రుణపడి ఉంటాం.
– వెంకటరత్నమ్మ, విద్యార్థిని తల్లి, పుత్తూరు మండలం


