
మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ ప్రకాశం
చిత్తూరు కలెక్టరేట్ : పదోతరగతి పరీక్షల అబ్జర్వర్‌గా సర్వీసెస్ జేడీ మువ్వా రామలింగం నియమితులయ్యారు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నిర్వహించే పదో తరగతి పరీక్షలను పర్యవేక్షించనున్నారు.
కోవిడ్ టెస్ట్‌లకు ఆదేశం
చిత్తూరు రూరల్: కోవిడ్ మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలో రోజూ కనీసం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం రోజూ 20 నుంచి 30 ర్యాపిడ్ పరీక్షలు చేయిస్తున్నామని, ఎక్కడా పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదని తెలిపారు.
మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి
చిత్తూరు రూరల్: వ్యాధి నిరోధక టీకాలను పక్కాగా వేయించాలని, మాతాశిశు సంరక్షనపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ జి.ప్రకాశం ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు కేసులను గుర్తించి వెంటనే చికిత్సలందించాలని కోరారు. సమావేశంలో డీఐఓ రవిరాజు, మలేరియా నివారణ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
నేడు విజిలెన్స్ అండ్
మానిటరింగ్ కమిటీ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం కోరింది.
పకడ్బందీగా
ఓపెన్ స్కూల్ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 3 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు నిర్వహించే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ విజయేంద్రరావు ఆదేశించారు. మంగళవారం ఆయన డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. పదో తరగతి పరీక్షలకు 1,244, ఇంటర్‌కు 3,309 మొత్తం 4,553 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. సమావేశంలో డీవైఈఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా వసతులు
గుడిపాల: పదోతరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పక్కాగా మౌలిక వసతులు కల్పించాలని డీఈఓ విజయేంద్రరావు ఆదేశించారు. మంగళవారం కమ్మతిమ్మాపల్లె ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం 197 రామాపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. స్కూలు పరిసరాలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భానుప్రసాద్‌రావు, సీఆర్పీ వాణిశ్రీ పాల్గొన్నారు.

గుడిపాల : పాఠశాలలో డెస్క్‌లను పరిశీలిస్తున్న డీఈఓ విజయేంద్రరావు