
నిరంతరం సేవలు
గ్రామ సచివాలయాలే కేంద్రంగా ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చూస్తున్నాం. 104 వాహనం ద్వారా గ్రామ స్థాయిలో ఉదయం ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, మధ్యాహ్నం తర్వాత ఇళ్లకు వెళ్లి చికిత్సలందించేలా ఏర్పాట్లు చేశాం. ప్రజలకు నిరంతరం సేవలందించడమే లక్ష్యగా పనిచేస్తున్నాం. – ప్రకాశం, డీఎంహెచ్‌ఓ
సాక్షి, చిత్తూరు : ప్రభుత్వం వైద్యరంగంలో పెను మార్పులను తీసుకువచ్చింది. పట్టణాల్లోని ప్రజలతోపాటు పల్లెవాసులకు సైతం మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వాస్పపత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేసింది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 104 వాహనాలతో గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నాణ్యమైన వైద్యసేవలను అందిస్తోంది.
వరంగా మారిన 104 వాహనాలు
గ్రామాల్లో మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక రోగులకు 104 సంచార వాహనాల వైద్య సేవలు వరంగా మారాయి. పట్టణాలు, మండలకేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంతూరులో ఇంటి వద్దనే ఉచితంగా చికిత్సలు అందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 44 వాహనాలు పల్లెప్రజలకు సేవలందిస్తున్నాయి.
● 104 వాహనాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ ప్రాంతాల్లోని సంచరిస్తుంటాయి. పీహెచ్‌సీ వైద్యుడు, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు ఆయా వాహనాల్లో అందుబాటులో ఉంటారు.
● గ్రామ సచివాలయం వద్ద వైద్య సేవలందిస్తారు. అలాగే మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నవారితోపాటు గర్భిణులు, విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిగతుల మేరకు మందులు అందిస్తున్నారు. సుమారు 14 రకాల వైద్య పరీక్షలు చేస్తారు.
● ఆదివారం మినహా నెలలో 26 రోజులపాటు 104 వాహనాల ద్వారా సేవలందుతాయి. ఒక గ్రామానికి ప్రతి నెలా రెండు పర్యాయాలు వస్తుంది.
● 104లో ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో పొందుపరుస్తారు. టెలీ మెడిసన్, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు అనుసంధానిస్తారు. భవిష్యత్‌లో ఎక్కడైనా తక్షణ వైద్యసేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. రోగి ఆరోగ్య స్థితిని బట్టి ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు.
పల్లెప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్యరంగంలో విప్లవాత్మకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత ఊరిలోనే చికిత్సలు పొందే వెసులుబాటు కల్పించింది. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ విలేజ్ హెల్త్‌క్లినిక్‌లను ప్రారంభించింది. 104 వాహనాల ద్వారా వైద్యనిపుణులతో సేవలందిస్తోంది. దీర్ఘకాలిక రోగులు, వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తోంది.
నిర్దేశించిన గ్రామాలకు వాహనాలు
నిర్దేశించిన గ్రామాలకు 104 వాహనాలు వెళ్లేలా చూస్తున్నాం. సిబ్బంది హాజరు, మందుల సరఫరా, వాహనాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.
– జి. ప్రతాప్, 104 జిల్లా మేనేజర్
మా ఊరిలోనే వైద్యం
నాలుగేళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నా. ప్రతి నెలా తప్పకుండా మా ఊరికి వచ్చి, నాకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన మందులు అందజేస్తున్నారు. తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. మా వద్దకే వచ్చి వైద్య సేవలను అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంది.
– ఎన్. జయమ్మ, జంగాలగ్రహారం, బైరెడ్డిపల్లె మండలం
ఆరోగ్య సమస్యల పరిష్కారం
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు తలెత్తే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు 104 వాహనాలు ఉపయోగపడుతున్నాయి. వీటి ద్వారా అందే సేవలపై పల్లెవాసులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడ ఎలా చికిత్సలు పొందాలో తెలియజేస్తున్నాం. దాదాపు 80శాతం సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కరిస్తున్నాం. – హరినారాయణన్, కలెక్టర్

104 వాహనం ద్వారా గ్రామంలో వైద్యసేవలందిస్తున్న సిబ్బంది



