
అర్జీలు స్వీకరిస్తున్న జేసీ వెంకటేశ్వర్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 349 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ మేరకు కుప్పం ఏరియా ఆస్పత్రిలో నవజాతి శిశువులు అనారోగ్యం పాలైనట్లుగా చిత్రీకరిస్తున్నారని కుప్పం ప్రజావేదిక సభ్యులు వేణు, మహేశ్, మునిరాజు, నవీన్ ఫిర్యాదు చేశారు. దీనిపై జేసీ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆరోగ్యంగా జన్మించినప్పటికీ పిల్లలకు పచ్చకామెర్లు, రక్తం సెప్టిక్ కావడం వంటి రోగాలు వచ్చినట్లు తల్లిదండ్రులకు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలున్నప్పటికీ పరీక్షలన్నీ ప్రైవేట్ ల్యాబ్‌లో చేస్తున్నారని ఆరోపించారు. కేవలం కమీషన్ కోసం వైద్యులు ఇలాంటి దందాలకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను జేసీ ఆదేశించారు.