‘ఆ గాయం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.. ఆ​మే స్వయంగా’

Zomato Delivery Executive Accuses Woman Hits Herself With Her Ring - Sakshi

యువతిపై జొమాటో డెలివరీ బాయ్‌ పరస్పర ఆరోపణలు

నిజ నిర్ధారణ అయ్యేంత వరకు ఇద్దరికీ సాయం చేస్తాం

వివాదంపై స్పందించిన జొమాటో కో ఫౌండర్‌ దేపేందర్‌ గోయల్‌

బెంగళూరు: మహిళా కస్టమర్‌-  ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వివాదంపై జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్‌ గోయల్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అప్పటి వరకు హితేషా చంద్రాణి వైద్య ఖర్చులు, అదే విధంగా అరెస్టైన డెలివరీ బాయ్‌ లీగల్‌ ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ‘‘పోలీసులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు మేం సహకరిస్తున్నాం. హితేషతో మేం కాంటాక్ట్‌లో ఉన్నాం. తన వైద్య ఖర్చులు భరిస్తున్నాం. అదే విధంగా కామరాజ్‌తో కూడా టచ్‌లోఉన్నాం. ఇద్దరూ తమ తమ వాదనలతో ముందుకు వచ్చారు. నిజం ఏమిటన్నది తెలుసుకోవడమే మా మొదటి ప్రాధాన్యం. అప్పటి వరకు ఇద్దరికి కావాల్సిన సహాయం అందిస్తాం’’ అని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. 

ఇక కస్టమర్‌పై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కామరాజ్‌, గత 26 నెలలుగా తమ సంస్థతో కలిసి పనిచేస్తున్నారన్న గోయల్‌.. ‘‘అతడు ఇప్పటి వరకు 5 వేల ఫుడ్‌ డెలివరీలు చేశాడు. తన సేవలకు గానూ 4.75/5 రేటింగ్‌ పొందాడు. నిజం నిర్ధారణ అయ్యేంత వరకు తనకు మద్దతుగా ఉంటాం’’ అని స్పష్టం చేశారు. జొమాటోలో భోజనం ఆర్డర్‌ చేసిన బ్యూటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌ హితేషా చంద్రానీ, ఫుడ్‌ డెలివరీ బాయ్‌ తనపై పిడి గుద్దులు కురిపించాడంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఎందుకు ఆలస్యం చేశారని అడిగినందుకు, రక్తం వచ్చేలా తనపై దాడి చేశాడంటూ ఆమె విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దీంతో డెలివరీ బాయ్ కామరాజ్‌‌, జొమాటోపై సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. 

గాయాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది!
ఈ నేపథ్యంలో కామరాజ్‌ గురువారం న్యూస్‌ మినిట్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆమెకు భోజనం అందించిన తర్వాత బిల్లు చెల్లించమని అడిగాను. అంతేకాదు ట్రాఫిక్‌జాం వల్ల ఆలస్యమైందని, అందుకు నన్ను క్షమించమని కోరాను కూడా. కానీ ఆమె ఫుడ్‌ తీసుకునేందుకు నిరాకరించారు. ఎలాగోలా ఒప్పించాను. అంతలోనే ఆమె ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసినట్లు నాకు సమాచారం అందింది. దీంతో ఫుడ్‌ ప్యాకెట్‌ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాను. కానీ, నేను ఎంతగా అడిగినా తను సరిగా స్పందించలేదు. ఇక లాభం లేదనుకుని తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే హిందీలో తిట్టడం మొదలుపెట్టారు. నన్ను నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చేతివేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం వచ్చింది. ఆమె ముఖాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. నేను తనపై చేయి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.  ఇక కేసులో ఇరుక్కున్న కారణంగా చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు, తనకు ఇప్పటికే రూ. 25 వేలు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

చదవండి: జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అరెస్ట్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top