డుగ్గుడుగ్గు బండికి గట్టి పోటీ.. యజ్డీ రీ ఎంట్రీ

Yezdi Brand Re Entered In India with Three Models - Sakshi

మూడు మోడళ్లతో రంగ ప్రవేశం

ధర రూ.1.98–2.18 లక్షల మధ్య

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కుర్రకారును 90వ దశకం వరకు ఉర్రూతలూగించిన చెక్‌ బ్రాండ్‌ యెజ్డీ బైక్స్‌ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో ఒకేసారి మూడు మోడళ్లు గురువారం ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్‌ ఉన్నాయి. 26 ఏళ్ల విరామం తర్వాత పోటీ ధరతో యెజ్డీ కొత్త జర్నీ ప్రారంభించడం విశేషం. మహీంద్రా గ్రూప్‌నకు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్‌ భారత్‌లో జావా, బీఎస్‌ఏతోపాటు తాజాగా యెజ్డీ బ్రాండ్‌ను పరిచయం చేసింది.

1996 వరకు యెజ్డీ బైక్స్‌ దేశంలో అందుబాటులో ఉన్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్, హోండా, కేటీఎంకు ఇప్పుడు యెజ్డీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఢిల్లీ ఎక్స్‌ షోరూంలో ధర మోడల్, వేరియంట్‌నుబట్టి రూ.1.98 లక్షల నుంచి రూ.2.18 లక్షల వరకు ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వద్ద ఉన్న ప్లాం టులో ఇవి తయారవుతున్నాయి. ఏటా 5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.

ఇవీ ఫీచర్ల వివరాలు..
అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్‌ మోడళ్లు 334 సీసీ సింగిల్‌ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్‌ కూల్డ్, డీవోహెచ్‌సీ ఇంజిన్‌తో తయారయ్యాయి. ఎలక్ట్రానిక్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్, కాన్‌స్టాంట్‌ మెష్‌ 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్, ఏబీఎస్, 29.1–30.2 పీఎస్‌ పవర్, డబుల్‌ క్రాడిల్‌ ఫ్రేమ్‌ వంటి హంగులు ఉన్నాయి. ట్యాంక్‌ సామర్థ్యం మోడల్‌నుబట్టి 12.5–15.5 లీటర్లు. బరువు 182–188 కిలోలు. సింగిల్‌ సైడ్‌ ఎగ్జాస్ట్‌తో అడ్వెంచర్, ట్విన్‌ ఎగ్జాస్ట్‌తో మిగిలిన రెండు మోడళ్లు రూపుదిద్దుకున్నాయి. విస్తృత స్థాయిలో  14 రంగులు కస్టమర్లను అలరించనున్నాయి. రూ.5 వేలు చెల్లించి బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చు. డెలివరీలు సైతం మొదలైనట్టు క్లాసిక్‌ లెజెండ్స్‌ కో–ఫౌండర్‌ అనుపమ్‌ థరేజా ఈ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్‌ పునరుద్ధరణ, డిజైన్, ఆర్‌అండ్‌డీ, పారిశ్రామికీకరణకు క్లాసిక్‌ లెజెండ్స్‌ ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top