అన్ని రంగాల్లోనూ ఏఐ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. చాలామంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. దీనిపై కొందరు నిపుణులు మిశ్రమంగా స్పందించారు. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ పలాంటిర్ టెక్నాలజీస్.. సీఈఓ 'అలెక్స్ కార్ప్' ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృత్రిమ మేధస్సు (AI) యుగంలో కూడా ఎవరు ఎదుగుతారు? అనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఏఐ వల్ల ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయినా.. రెండు రకాల వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొదటివారు 'వృత్తి ఆధారిత నైపుణ్యాలు' కలిగిన వారు. ఉదాహరణకు మెకానిక్‌లు, ఎలక్ట్రిషన్‌లు, టెక్నీషియన్‌లు వంటి ప్రాక్టికల్ పనులు చేసే వ్యక్తులు. ఈ పనులను పూర్తిగా AI చేత భర్తీ చేయడం కష్టం.
రెండవ వర్గం 'న్యూరోడైవర్జెంట్' వ్యక్తులు. అంటే న్యూరోడైవర్సిటీ అనే భావనకు చెందిన వారు. సాధారణంగా కాకుండా.. భిన్నంగా ఆలోచించే వారు, కొత్త మార్గాలను అనుసరించే వారు, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించే వారు వీరందరూ ఈ వర్గంలోకి వస్తారని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు.
సంప్రదాయ ఉద్యోగాలైన.. సాధారణ కోడింగ్, లా వర్క్, లేదా రీడింగ్, రైటింగ్ వంటి పనులను ఏఐ సులభంగా చేస్తుంది. అంటే ఈ రకమైన ఉద్యోగాలు చేసేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో పనిచేసేవారు.. తప్పకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో ఎక్కువ ప్రాముఖ్యత పొందేది సృజనాత్మకత, ఒరిజినల్ ఆలోచన, కొత్తదనం సృష్టించే సామర్థ్యం మాత్రమే అని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు. మనం ఒక ఆర్టిస్ట్ మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. విషయాలను భిన్న కోణాల్లో చూడగలగడం, కొత్త పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం అవుతుంది. ఇలాంటి వాళ్లను ఏఐ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి వృత్తి నైపుణ్యాలు కలిగిన వారు, భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఏఐ ప్రపంచంలో కూడా ముందంజలో ఉండే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!


