
17,200 కోట్ల సమీకరణకు టాటా క్యాపిటల్ రెడీ
కంపెనీ విలువ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ. 94,600 కోట్లు)గా నమోదుకానున్నట్లు తాజాగా అంచనా వేశాయి. ఈ ఇష్యూ పూర్తియితే దేశంలో అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది.
లిస్టింగ్‌కు వీలుగా టాటా గ్రూప్ దిగ్గజం ఇటీవలే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో మొత్తం 26.58 కోట్ల షేర్లు విక్రయించనుంది. వీటిలో 21 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
టాటా క్యాపిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ లిస్టయితే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నమోదుకానుంది. వెరసి టాటా గ్రూప్ నుంచి రెండేళ్లలో రెండు కంపెనీలు లిస్టింగ్‌ను పొందినట్లవుతుంది. ఇంతక్రితం ఐటీ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ 2023 నవంబర్‌లో ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.
పటిష్ట పనితీరు: ఈ ఏడాది తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో టాటా క్యాపిటల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ.1,041 కోట్లకు చేరింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ.472 కోట్లు ఆర్జించింది. ఆదా యం రూ. 6,557 కోట్ల నుంచి రూ.7,692 కోట్లకు ఎగసింది.