డిజిటల్‌ చెల్లింపులకు యూపీఐ ఊతం.. | UPI Surges to 21 7 Billion Monthly Transactions Empowering Indians | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపులకు యూపీఐ ఊతం..

Mar 31 2026 8:53 AM | Updated on Mar 31 2026 9:36 AM

UPI Surges to 21 7 Billion Monthly Transactions Empowering Indians

దేశీయంగా డిజిటల్‌ పేమెంట్స్‌కి సంబంధించి ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) గణనీయంగా పెరిగిందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గ్రోత్‌ సోహిని రాజోలా తెలిపారు. యూపీఐ ప్రస్తుతం నెలకు 2,170 కోట్ల లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తోందని, దేశంలో దాదాపు సగం జనాభా అంటే.. 50.4 కోట్ల మంది దీన్ని వినియోగిస్తున్నారని ఆమె వివరించారు.

2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్‌ చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్‌ మాధ్యమంలో జరగగా, విలువపరంగా యూపీఐ వాటా అందులో 84 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. 2021తో పోలిస్తే ఇది 1.6 రెట్లు అధికమని వివరించారు. ఆర్థిక సమ్మిళితత్వానికి కూడా యూపీఐ ఉపయోగపడుతోందన్నారు. ప్రాథమిక బ్యాంకింగ్‌ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండే ప్రాంతాల్లో కూడా విస్తరించిందని, ప్రస్తుతం 19,000 పైచిలుకు పిన్‌ కోడ్స్‌లో అందుబాటులో ఉందని సోహిని వివరించారు.  

యూపీఐ వినియోగ ధోరణులు కూడా మారుతున్నాయని సోహిని చెప్పారు. చిన్న మొత్తాల్లో చెల్లించేందుకు కొత్త యూజర్లు చేరుతుండటమనేది ఈ విధానం అందరికీ అందుబాటులోకి రావడాన్ని సూచిస్తోందన్నారు. ప్రతి యూజరు చేసే చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయని సోహిని వివరించారు. ఇక వ్యక్తుల కన్నా వ్యాపార వర్గాలకు జరిపే చెల్లింపులు వరుసగా గత మూడేళ్లుగా వేగంగా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. నిత్యావసరాలు, సూపర్‌మార్కెట్లు, రెస్టారెంట్లు, సర్వీస్‌ స్టేషన్లు, మెడికల్‌ స్టోర్స్‌ మొదలైన అన్ని చోట్లా యూపీఐ ఆమోదయోగ్యత పెరగడం ఇందుకు దోహదపడుతున్నట్లు సోహిని చెప్పారు.

ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

Advertisement
 
Advertisement
Advertisement