కిరాణా కొట్టు నుంచి షాపింగ్ మాల్‌ వరకు.. ఇలా అయితేనే నడిచేది

Social Media To Play Crucial Role In Retail Sector - Sakshi

సోషల్‌ మీడియా అంటే ఒకప్పుడు మనకు సంబంధించిన సమాచారాన్ని వర్చువల్‌గా మరొకరితో పంచుకోవడం కోసం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీగా పరిగణించాం. ఆ తర్వాత వ్యక్తులుగా దూరంగా ఉన్నా.. చాలా దగ్గరగా ఉన్న అనుభూతిని అందించే గొప్ప మాధ్యమాలుగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మనం ఏం కొనాలో ఎప్పుడు కొనాలో ఎవరి దగ్గర కొనాలో అనే విషయాలను కూడా ప్రభావితం చేసే శక్తులుగా ఎదిగాయి. 

విపత్తుతో వచ్చిన మార్పు
అనుకోకుండా వచ్చిన కోవిడ్‌ విపత్తు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో వ్యాపార రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పౌడర్‌ డబ్బా నుంచి ఫోన్ల వరకు ఏది కొనుగోలు చేయాలన్నా ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ల్యాప్‌ట్యాప్‌, డెస్క్‌టాప్‌, మొబైల్‌ఫోన్లే వర్చువల్‌ షాపింగ్‌మాల్స్‌గా మారుతున్నాయి. ఇక్కడ ఏ వస్తువులు కొనాలనేది మనకు తెలియకుండానే సోషల్‌ మీడియా ఖాతాలే డిసైడ్‌ చేస్తున్నాయి. మన అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా మార్కెట్‌ను మన ముందుకు తెస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో 50 కోట్ల మంది
కోవిడ్‌ సంక్షోభం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌ షాపింగ్‌కి షిఫ్ట్‌ అయ్యారు. కరోనా కష్టాలు మొదలయ్యాక కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఈ కామర్స్‌ రంగం 94 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో 4.7 కోట్ల మంది కొత్తగా బేసిక్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు షిఫ్ట్‌ అయ్యారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 7.8 కోట్లు పెరిగింది. అంటే పాత వారితో పాటు కొత్తగా ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్న వారిలో చాలా మంది యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా వంటి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం దేశ జనాభాలో 33 శాతం మంది సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అంటే కనీసం యాభై కోట్ల మంది జనాభా నిత్యం సామాజిక మాధ్యమాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

స్థిర వ్యాపారాన్ని మించి
సాధారణంగా గల్లీ చివర కిరాణా కొట్టు మొదలు బడా షాపింగ్ మాల్‌ వరకు వ్యాపారం స్థిరమైన నిర్మాణాలు ఉన్న చోటే జరుగుతుంది. అక్కడ లభించే వస్తువులు, ఉత్పత్తుల గురించి వేర్వేరు చోట్ల ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆన్‌లైన్‌ బిజినెస్‌లో ఈ కష్టాలు ఉండవు. కస్టమర్‌ ఎక్కడుంటే ప్రొడక్ట్‌ అక్కడే కనిపిస్తుంది. ఆయా ప్రొడక్టుకు సంబంధించిన సమాచారం, ప్రకటనలు కూడా కస్టమర్‌కి అతి దగ్గర ఇంచుమించు అతని నీడలా వెన్నంటి ఉంటాయి. దీంతో కస్టమర్‌కి చేరువ కావడం అమ్మకాలు జరిపించడం ఆన్‌లైన్‌లో తేలికగా మారింది.

కీలకంగా సోషల్‌ మీడియా
స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇంటర్నెట్‌ ద్వారా వేల కొద్ది వస్తువులు మన చెంతనే ఉన్నా అందులో మనకు ఏదీ అవసరం, ఎప్పుడు అవసరం అనే విషయాలు సెర్చ్‌ చేయడమనేది సాధారణ విషయమేమీ కాదు. కానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారి అభిరుచులు, అవసరాలను ఎప్పటికప్పుడు మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలిసి పోతుంది. దానికి అనుగుణంగా వారికి అవసరమైన వస్తువులు, ఉత్పత్తులే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫార్మ్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో కస్టమర్‌కి అతి దగ్గరగా వెళ్లే అవకాశం ఈ కామర్స్‌కి ఉంటోంది. తాజా నివేదికల ప్రకారం ఒక వ్యక్తి కొనుగోలులో సోషల్‌ మీడియా ప్రభావం 34 శాతం ఉంటోంది. 

రెండూ ఉంటేనే 
ప్రజలు వేగంగా ఈ కామర్స్‌ రంగానికి మారుతున్న వైనం, కొనుగోలు విషయంలో సోషల్‌ మీడియా ప్రభావాన్ని గమనించిన అనేక బడా సంస్థలు తమ బిజినెస్‌ మాడ్యుల్‌లో మార్పులు చేసుకుంటున్నాయి. షాప్‌ లేదా బడా మాల్స్‌ను నిర్వహించడంతో పాటు వాటికి అనుబంధంగా ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ని కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి మార్పులు చేసిన సంస్థల వ్యాపారం గతం కంటే బాగుండగా కేవలం సంప్రదాయ వ్యాపారానికే పరిమితమైన చోట వృద్ధి రేటు తక్కువగా ఉంటోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top