ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం

Sensex, Nifty Log Worst Day In Six Weeks - Sakshi

సూచీలకు ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల షాక్‌

వడ్డీరేట్ల భయాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు

ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో భారీ అమ్మకాలు

సెన్సెక్స్‌ నష్టం 1,172 పాయింట్లు

17,200 దిగువకు నిఫ్టీ

నాలుగోరోజూ నష్టాలే

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సోమవారం ఆరు వారాల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల భారీ పతనం సూచీల నష్టాలను శాసించాయి. దేశీయంగా వినిమయ, టోకు ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంపు ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం భయాలతో పాటు తాజాగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్‌ సూచీలు రెండు శాతం క్షీణించాయి.

సెన్సెక్స్‌ 1,172 పాయింట్లు పతనమై 57,167 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లకు గానూ 20 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ 302 పాయింట్లను కోల్పోయి 17,174 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,387 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.3,342 కోట్ల షేర్లను కొన్నారు. ఆరంభ నష్టాలను పూడ్చుకున్న రూపాయి డాలర్‌ మారకంలో ఆరు పైసలు బలహీనపడి 76.25 స్థాయి వద్ద ముగిసింది.   

1,000 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభం  
నాలుగు సెలవు రోజుల అనంతరం ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూలతలను అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 1,000 పాయింట్లను కోల్పోయి 57,339 వద్ద, నిఫ్టీ 293 పాయింట్ల పతనంతో 17,183 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి దశలో కాస్త కోలుకునే ప్రయత్నం చేసినా.., రికవరీకి తోడ్పాటును అందించే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,497 పాయింట్లు క్షీణించి 56,842 వద్ద, నిఫ్టీ  408 పాయింట్లను కోల్పోయి 17,068 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.  

► మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీ ప్లాట్‌ఫామ్‌ ‘బీఎస్‌ఈ స్టార్‌ ఎంఎఫ్‌’పై సోమవారం 30.11 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 11 తర్వాత ఒకరోజులో ఇదే గరిష్టస్థాయి అని బీఎస్‌ఈ తెలిపింది.  
► సూచీలు రెండు శాతం పతనంతో స్టాక్‌ మార్కెట్లో రూ. 2.58 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తద్వారా బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. 
 

బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు  
చైనా ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 4.8 శాతం వృద్ధికి పరిమితం కావడంతో పాటు కోవిడ్‌ కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. జపాన్, సింగపూర్, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, స్టాక్‌ సూచీలు ఒకశాతం వరకు పతనమైంది ఇండో నేసియా మార్కెట్‌ మాత్రం నష్టాల నుంచి తేరుకొని అరశాతం లాభపడింది. హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌ సెలవు. ఈస్టర్‌ హాలిడేస్‌ సందర్భంగా యూరప్‌ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.  

ఇన్ఫోసిస్‌కు రూ.53,509 కోట్ల నష్టం  
మార్చి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్ఫోసిస్‌ షేరు సోమవారం ఏడుశాతానికి పైగా క్షీణించి రూ.1,621 వద్ద స్థిరపడింది. గత బుధవారం (ఏప్రిల్‌ 13)మార్కెట్‌ ముగిసిన తర్వాత కంపెనీ క్యూ4 ఫలితాలను వెల్లడించింది. బలహీనమైన నిర్వహణ మార్జిన్‌ నమోదు నేపథ్యంలో షేరు ఉదయం 8% నష్టంతో రూ.1592 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో తొమ్మిది శాతం క్షీణించి రూ.1,592 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్చి 16, 2020 తర్వాత షేరు ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీకి ఒక్కరోజులోనే రూ.53,509 కోట్ల నష్టం వాటిల్లింది.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 5 శాతం పతనం
ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు ఐదు శాతం నష్టపోయి రూ. 1,395  వద్ద స్థిరపడింది. క్యూ4లో నికర లాభం అంచనాలను అందుకోలేకపోవడం షేరు పతనానికి కారణమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఐదు శాతం నష్టపోయి రూ.1,390 స్థాయిని తాకింది. బీఎస్‌ఈలో 4.94 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.38,542 కోట్లు కుచించుకుపోయి రూ.7.73 లక్షల కోట్లు వద్ద స్థిరపడింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► తన అనుబంధ సంస్థలో యూఎస్‌ కంపెనీ బ్లాక్‌రాక్‌ రియల్‌ అసెట్స్‌ రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు టాటా పవర్‌ ప్రకటనతో ఈ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్‌ఈలో ఆరు శాతం నష్టంతో రూ.258 వద్ద స్థిరపడింది.  
► ఈ వేసవి సీజన్‌లో విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందన్న అంచనాతో ఎన్‌టీపీసీ షేరు ఆరుశాతం లాభపడి రూ.163 వద్ద స్థిరపడింది.  
‘‘ఐటీ, బ్యాంకింగ్‌ రంగ దిగ్గజాలు నిరాశాజనకమైన గణాంకాలతో ఆర్థిక ఫలితాల సీజన్‌ను ప్రారంభించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. భారత్‌లో కోవిడ్‌ కేసుల నమోదు, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్‌కు దిశానిర్ధేశాన్ని చూపుతాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top