
ప్రస్తుతం అంతర్జాతీయంగా తమకు అతి పెద్ద మార్కెట్లలో రెండో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే అగ్ర స్థానానికి చేరుతుందని ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ప్రజలు, వ్యాపార సంస్థలు గణనీయ స్థాయిలో కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయని ఆయన వివరించారు.
కొత్త తరం మోడల్ జీపీటీ-5ని ఆల్ట్‌మన్ ఆవిష్కరించారు. ఇది అందరికీ ఉచితమని వివరించారు. తాము మరిన్ని ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రజలకు ఏఐని మరింతగా అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నామని, స్థానిక భాగస్వాములతో కూడా కలిసి పని చేస్తున్నామని ఆల్ట్‌మన్ చెప్పారు.
జీపీటీ–5 గురించి వివరిస్తూ, కోడింగ్.. ఏజెంటిక్ టాస్క్‌లకు ఇప్పటివరకు వచ్చిన మోడల్స్‌లో ఇది అత్యుత్తమమైనదని వివరించారు. డెవలపర్లకు మరింత వెసులుబాటు లభించేలా ఏపీఐలో జీపీటీ–5, జీపీటీ–5–మినీ, జీపీటీ–5–నానో అని మూడు విధాలుగా ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..
కొత్త మోడల్ 12 భారతీయ భాషలను అర్థం చేసుకోగలుగుతుందని ఆల్ట్‌మన్ చెప్పారు. ఉచిత, ప్లస్, ప్రో యూజర్లకు జీపీటీ–5 ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి రాగా, ఎంటర్‌ప్రైజ్.. ఎడ్యుకేషన్ యూజర్ల సెగ్మెంట్‌కు వారం తర్వాత నుంచి లభిస్తుందని వివరించారు.