త్వరలో 10 బిలియన్‌ డాలర్లకు ’రూపీ’ ఎగుమతులు

Rupee-denominated exports may touch USD 8 to10 billion soon - Sakshi

రష్యాలో భారత ఉత్పత్తులకు సానుకూల డిమాండ్‌

ఎఫ్‌ఐఈవో డీజీ సహాయ్‌ వెల్లడి

కోల్‌కతా:  రూపాయి మారకం ఆధారిత ఎగుమతులు త్వరలో 8–10 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ చెప్పారు. రష్యాలో భారత ఉత్పత్తులకు డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, రెండు దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆయన తెలిపారు.

విదేశీ కరెన్సీ మారకం ఆధారిత ఎగుమతులకు ఇచ్చే ప్రయోజనాలన్నీ రూపీ ఆధారిత ఎగుమతులకు కూడా ప్రభుత్వం, బ్యాంకులు కల్పించడం కోసం ఎగుమతిదారులు ఎదురుచూస్తున్నారని సహాయ్‌ తెలిపారు. యూకో తదితర బ్యాంకులు ప్రాసెసింగ్‌ మొదలుపెట్టాక వచ్చే పక్షం రోజుల్లో రూపాయి మారకంలో సెటిల్మెంట్‌ ఆధారిత వాణిజ్య విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు సహాయ్‌ వివరించారు.

ప్రస్తుతం రష్యాకు భారత్‌ ఎగుమతులు 3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రష్యా నుండి దిగుమతులు (ఎక్కువగా ఆయిల్‌) 400 శాతం పెరిగాయి. ఇక భారత్‌ నుంచి రష్యాకు ఎక్కువగా టీ, కాఫీ, పొగాకు, చక్కెర మినహా ఇతర ఎగుమతులు తగ్గుతున్నాయి. అయితే, రూపాయి ట్రేడింగ్‌ మెకానిజం అందుబాటులోకి వచ్చాక ఈ వాణిజ్య లోటు క్రమంగా తగ్గవచ్చని అంచనాలు ఉన్నాయి.

750 బిలియన్‌ డాలర్ల టార్గెట్‌ సాధిస్తాం..
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 750 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సులభంగానే సాధించగలమని సహాయ్‌ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా సర్వీసుల వృద్ధి పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉత్పత్తుల ఎగుమతులు 6.6 శాతం వృద్ధితో 450 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సర్వీసులు 30 శాతం వృద్ధి చెంది 330–340 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు.

సెప్టెంబర్‌ ఆఖరు నాటికి ఉత్పత్తుల ఎగుమతులు 232 బిలియన్‌ డాలర్లుగాను, సర్వీసులు 150.4 బిలియన్‌ డాలర్లుగాను ఉన్నట్లు తెలిపారు. ‘అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అవాంతరాలు ఉన్నప్పటికీ భారత్‌ పటిష్ట స్థానంలో ఉంది. యూరప్‌కు రష్యా ఉత్పత్తుల ఎగుమతులు (చమురు, గ్యాస్‌ కాకుండా) 65 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. దీన్ని భారత్‌ అందిపుచ్చుకోవాలి. అలాగే తయారీ కోసం చైనాపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇతర దేశాలు పాటిస్తున్న విధానాలు కూడా భారత్‌ ఎగుమతులను పెంచుకునేందుకు దోహదపడవచ్చు‘ అని సహాయ్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top