బాబోయ్‌, నకిలీ బ్రాండెడ్‌ ఉత్పత్తులు.. ఆందోళనలో పెద్ద కంపెనీలు

Rising Sales Of  Fake Brands Electronic Products Accessories In Indian Market - Sakshi

పోర్టబుల్‌ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌కు దేశంలో బలమైన డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు బ్రాండెడ్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్‌ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీలు, దొంగిలించిన, చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్‌తో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ మార్కెట్‌ వృద్ధి చెందడం ఇందుకు కారణం. నకిలీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుండి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది.

ఒకవైపు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిసారిస్తూనే మరోవైపు నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆహోరాత్రులూ శ్రమించాల్సిన పరిస్థితి బ్రాండెడ్‌ కంపెనీలది. 2019 సెప్టెంబర్‌లో ఫిక్కీ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌తోసహా అయిదు రంగాల్లో నకిలీ ఉత్పత్తులు, అక్రమ రవాణా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా రూ.1.17 లక్షల కోట్లు నష్టపోతోంది.  

పట్టుపడుతూనే ఉన్నాయి.. 
ఈ ఏడాది జనవరి–జూన్‌ కాలంలో ఇయర్‌ఫోన్స్, చార్జర్స్, అడాప్టర్స్, యూఎస్‌బీ కేబుల్స్‌ వంటి రూ.73.8 లక్షల విలువైన 9 వేల పైచిలుకు నకిలీ ఉత్పత్తులను సీజ్‌ చేసినట్టు షావొమీ ప్రకటించింది. 2020లో కంపెనీ రూ.33.3 లక్షల విలువైన సుమారు 3 వేల ఉత్పత్తులను సీజ్‌ చేసింది. దీనినిబట్టి చూస్తే నకిలీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఈ నకిలీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని షావొమీ అంటోంది. కోవిడ్‌ రాకతో ఈ ఉత్పత్తులను ఏకంగా ఆన్‌లైన్‌ వేదిక ద్వారా విక్రయిస్తున్నారని వెల్లడించింది. జేబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్‌ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు శామ్‌సంగ్‌ అనుబంధ కంపెనీ హర్మాన్‌ తెలిపింది. కాగా, ఐడీసీ గణాంకాల ప్రకారం భారత మార్కెట్లో 2022 జనవరి–జూన్‌ కాలంలో 3.8 కోట్ల యూనిట్ల వేరబుల్స్‌ అమ్ముడయ్యాయి.  

నియంత్రణ లేక.. 
చిన్న గ్యాడ్జెట్స్‌లో నకిలీలను సులువుగా తయారు చేయవచ్చని, వీటిని చైనా నుంచి సులభంగా తీసుకు రావొచ్చని టెక్‌ఆర్క్‌ ఫౌండర్‌ ఫైజల్‌ కవూసా తెలిపారు. ‘ఆఫ్‌లైన్‌ మార్కెట్లు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌లో కఠినమైన తనిఖీలు లేకపోవడం వల్ల నకిలీ ఉత్పత్తుల చెలామణి పెరిగింది. ఆన్‌లైన్‌లో ఎవరైనా ఉత్పత్తులను నమోదు (లిస్ట్‌) చేసి విక్రయించవచ్చు. ఇది నకిలీలను విక్రయించడాన్ని సులభతరం చేసింది’ అని వివరించారు. ఐఎంఈఐ నంబర్‌తో స్మార్ట్‌ఫోన్లను ట్రాక్‌ చేయడానికి, గుర్తింపునకు ఆస్కారం ఉంది. యాక్సెసరీస్‌కు ఇటువంటి సౌకర్యం లేదు. యాపిల్‌ఎయిర్‌పాడ్స్‌ను ఫోన్‌ ద్వారా ట్రాక్‌ చేయవచ్చు.  

చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లకు భారీ షాక్‌! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top