రిటైల్ అమ్మకాలు పుంజుకుంటున్నాయ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయాలు గాడిన పడుతున్నాయి. కరోనా ముందు నాటి విక్రయాల్లో (2019 జూలై) 72 శాతానికి ఈ ఏడాది జూలైలో చేరినట్టు రిటైలర్ల జాతీయ సంఘం (రాయ్) తెలిపింది. రానున్న పండుగల సందర్భంగా విక్రయాలు మరింత జోరందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈఏడాది జూన్‌లో కరోనా ముందు నాటి విక్రయాల్లో 50 శాతానికి కోలుకున్నట్టు తెలిపింది. దక్షిణాదిన రిటైల్ అమ్మకాలు మరింత బలంగా ఉన్నట్టు వివరించింది.
కరోనా ముందు నాటితో పోలిస్తే 82 శాతానికి పుంజుకున్నాయని తెలిపింది. పశ్చిమభారతావనిలో విక్రయాలు ఇంకా కోలుకోవాల్సి ఉందంటూ.. జూలైలో 57 శాతానికి చేరినట్టు వివరించింది. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌లు సుదీర్ఘకాలం పాటు కొనసాగడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. వేగంగా సేవలు అందించే రెస్టారెంట్ల వ్యాపారం (క్యూఎస్‌ఆర్) ఈ ఏడాది జూలైలో కరోనా ముందు నాటితో పోలిస్తే 97 శాతానికి చేరుకున్నట్టు రాయ్ తెలిపింది. ఆధునిక రిటైల్ వ్యాపారంపై ఆంక్షలను తొలగించి, సాఫీ కార్యకలాపాలకు వీలు కల్పిస్తున్నందున రానున్న పండుగల సీజన్‌లో విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ వివరించారు.