ఇక జియో ఫైనాన్షియల్‌ సర్వీసులు

Reliance shareholders and creditors approve demerger of financial services arm - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి విడదీత

వాటాదారులకు ప్రతీ షేరుకీ 1 షేరు జారీ

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) తమ ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఇందుకు వాటాదారులు, రుణదాతలు తాజాగా ఆమోదముద్ర వేశారు. తొలుత రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎస్‌ఐఎల్‌) పేరుతో విడదీయనున్న కంపెనీని తదుపరి జియో ఫైనాన్షియల్‌ సర్వీసులుగా మార్పు చేయనున్నారు. వాటాదారుల సమావేశంలో ఈ ప్రతిపాదనకు 99.99 శాతం ఓట్లు లభించినట్లు ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. కాగా.. ఆర్‌ఐఎల్‌ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ రూ. 10 ముఖ విలువగల ఆర్‌ఎస్‌ఐఎల్‌ షేరును జారీ చేయనున్నారు. తదుపరి ఆర్‌ఎస్‌ఐఎల్‌.. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(జేఎఫ్‌ఎస్‌ఎల్‌)గా ఆవిర్భవించనుంది.  

సెప్టెంబర్‌కల్లా లిస్టింగ్‌
జెఫరీస్‌ రీసెర్చ్‌ వివరాల ప్రకారం జేఎఫ్‌ఎస్‌ఎల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో సెప్టెంబర్‌కల్లా లిస్ట్‌కానుంది. ఇందుకు అప్పటికల్లా అన్ని అనుమతులూ లభించగలవని అభిప్రాయపడింది. కంపెనీ వెనువెంటనే రుణ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. అసెట్‌ మేనేజ్‌మెంట్, జీవిత, సాధారణ బీమా విభాగాలకు నియంత్రణ సంస్థల అనుమతులను కోరనుంది. వీటిని 12–18 నెలల్లోగా పొందే వీలున్నట్లు జెఫరీస్‌ పేర్కొంది. ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగాన్ని విడదీసేందుకు గతేడాది అక్టోబర్‌లో ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఆర్‌ఎస్‌ఐఎల్‌ వ్యవహరిస్తోంది. ఆర్‌బీఐ వద్ద రిజిస్టరై డిపాజిట్లు సమీకరించని ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీగా కొనసాగుతోంది.  
ఈ వార్తల నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు 1.2 శాతం బలపడి రూ. 2,448 వద్ద ముగిసింది.

కామత్‌కు బాధ్యతలు
ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో కేవీ కామత్‌ను జేఎఫ్‌ఎస్‌ఎల్‌కు నాన్‌ఎగ్జిక్యూటివ్‌గా చైర్మన్‌గా ఆర్‌ఐఎల్‌ ఎంపిక చేసింది. 2021–22లో ఈ విభాగం రూ. 1,536 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 27,964 కోట్ల సంయుక్త ఆస్తులను కలిగి ఉంది. బ్రోకింగ్‌ సంస్థ మెక్వారీ వివరాల ప్రకారం జియో ఫైనాన్షియల్‌ విలువ రూ. 1.52 లక్షల కోట్లకుపైనే. దేశీయంగా ఐదో అతిపెద్ద ఫైనాన్షియల్‌ సర్వీసుల సంస్థగా నిలవనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top