ఫోన్‌ పే చేతికి ఇండస్‌ ఓఎస్‌! | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పే చేతికి ఇండస్‌ ఓఎస్‌!

Published Sat, May 22 2021 12:06 AM

PhonePe In Talks To Acquire Indian App Store Indus OS - Sakshi

ముంబై: కంటెంట్, యాప్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ఇండస్‌ ఓఎస్‌ను.. డిజిటల్‌ పేమెంట్స్‌ దిగ్గజం ఫోన్‌ పే సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం కుదిరితే ఫోన్‌ పే 6 కోట్ల డాలర్లు(సుమారు రూ. 440 కోట్లు) చెల్లించే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. తద్వారా ఫుడ్, ట్రావెల్, షాపింగ్, లైఫ్‌స్టైల్‌ తదితర విభాగాలతో కూడిన సూపర్‌ యాప్‌ ‘స్విచ్‌’ను ఫోన్‌ పే మరింత విస్తరించే వీలుంది. పలు విభాగాలకు చెందిన సర్వీసులను ఒకే గొడుగు కింద అందించేందుకు స్విచ్‌ను ఫోన్‌ పే రూపొందించింది. కాగా.. దేశీ భాషల కంటెంట్‌ ద్వారా ఇండస్‌ ఓఎస్‌ వినియోగదారులకు చేరువైంది. వెరసి ఇండస్‌ ఓఎస్‌ కొనుగోలు ద్వారా ఫోన్‌ పే స్థానిక డెవలపర్స్‌ను ఆకట్టుకునేందుకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.  


ఇండస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ 
ఐఐటీ పూర్వవిద్యార్ధులు రాకేష్‌ దేశ్‌ముఖ్, ఆకాష్‌ డాంగ్రే, బి.సుధీర్‌ కలసి 2015లో ఇండస్‌ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇండస్‌ యాప్‌ బజార్‌ పేరుతో ఆండ్రాయిడ్‌ యాప్‌స్టోర్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 12 భారతీయ భాషల ద్వారా యాప్‌లతోపాటు, కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తోంది. 4 లక్షల యాప్‌లకు నిలయమై..10 కోట్లకుపైగా కస్టమర్లకు సర్వీసులందిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.  


ఫోన్‌ పే జోరు 
దేశీయంగా యూపీఐ చెల్లింపులలో ఫోన్‌ పే.. టాప్‌ ర్యాంక్‌ థర్డ్‌ పార్టీ ప్రాసెసర్‌గా నిలుస్తోంది. గత నెల(ఏప్రిల్‌)లో 119 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించింది. వీటి విలువ రూ. 2.34 లక్షల కోట్లుకాగా.. దాదాపు 45 శాతం మార్కెట్‌ వాటాకు సమానమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇటీవల మాతృ సంస్థ వాల్‌మార్ట్‌ నుంచి 70 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,100 కోట్లు) పెట్టుబడులను అందుకుంది. దీంతో ఫోన్‌ పే విలువ 550 కోట్ల డాలర్ల(రూ. 40,200 కోట్లు)కు చేరినట్లు అంచనా.   

Advertisement

తప్పక చదవండి

Advertisement