పర్సనల్‌ కంప్యూటర్లు ప్రియం

Personal computers prices are 50 percent hike - Sakshi

50 శాతంపైగా పెరిగిన ఉత్పత్తుల ధర

డిమాండ్‌ ఉన్నా సరఫరా అంతంతే

హై ఎండ్‌ మోడళ్లపైనే కంపెనీల గురి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిప్‌సెట్‌ కొరత ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్‌ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్‌ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్‌ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్‌టాప్‌లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఆల్‌ ఇన్‌ వన్స్‌ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్‌–జూన్‌ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం.

నిలిచిపోయిన సరఫరా..
ల్యాప్‌టాప్స్‌లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్‌ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్‌ అంతా హై ఎండ్‌ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్‌ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్‌ ఎండీ అహ్మద్‌ తెలిపారు. లో ఎండ్‌ ల్యాప్‌టాప్స్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు.

పేరుతోపాటు ధర కూడా..
కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్‌ వచ్చిందంటే మోడల్‌ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్‌సెట్‌ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్‌ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్‌టాప్‌ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్‌లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్‌టాప్‌ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్‌ ఇన్‌ వన్‌ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్‌జెట్‌ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్‌జెట్‌ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top