
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున మినహాయింపులతో కొత్త పన్ను విధానం అమల్లోకి రాగా, అధిక వేతనం ఆర్జించే వారికి గణనీయంగా పన్ను ఆదా కానుంది. ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది ఉద్యోగులు నౌకరీ నిర్వహించిన సర్వేలో తెలిపారు. విచక్షణారహిత వ్యయాలకు బదులు పెట్టుబడులకు, రుణాల తిరిగి చెల్లింపులకు ఆదా అయ్యే మొత్తాన్ని వెచ్చిస్తామని నిపుణులు చెప్పారు. రూ.12.75 లక్షల వరకు ఆర్జించే 20వేల మంది నిపుణుల అభిప్రాయాలను నౌకరీ సర్వేలో భాగంగా తెలుసుకుంది.
కొత్త పన్ను విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాల గురించి తెలుసనని 64 శాతం మంది చెప్పగా, 43 శాతం మంది తమకు దీనిపై స్పష్టత లేదనో, అసలు తెలియదనో చెప్పడం గమనార్హం.
పన్ను మినహాయింపుల కారణంగా మిగిలే మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది వెల్లడించారు. రుణాల చెల్లింపులకు వినియోగిస్తామని 30 శాతం మంది తెలిపారు.
9 శాతం మంది మెరుగైన జీవనం కోసం ఖర్చు చేస్తామని, 4 శాతం మంది ప్రయాణాలు, విహార యాత్రల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.
ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 63–64 శాతం మంది నిపుణులు మిగులు ఆదాయాన్ని పక్కన పెడతామని తెలిపారు.
చెన్నైలో 44 శాతం నిపుణులు రుణ చెల్లింపులకు వినియోగిస్తామని చెప్పగా, ముంబైలో 51 శాతం మంది రిటైర్మెంట్ అవసరాలకు మళ్లిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం